తొగుట : సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ( CM Tour ) సందర్భంగా తొగుట పోలీసులు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమగారి నాగిరెడ్డి ( Nagireddy ) ని ముందస్తుగా అరెస్టు( Arrest ) చేశారు. ఈ అరెస్టులపై రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి, కో-కన్వీనర్ భరత్ సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
నాగిరెడ్డి అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేయడమేనన్నారు. 2024 మార్చి నుంచి రిటైర్ట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల కోసం రెండు సంవత్సరాలుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ మాత్రమే ఇస్తూ, ఇతర బకాయిలను చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఈ సమస్యపై పలుమార్లు పోరాటాలు జరిగినా ఫలితం లేకపోవడం బాధాకరమని తెలిపారు.
అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని నాగిరెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు రేవా జిల్లా అధ్యక్షుడు పోనమల రాములు సహా పలువురు నాయకులను స్టేషన్లో నిర్బంధించారని ఆరోపించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెన్షనర్ల బకాయిల చెల్లింపుకు నిధులు కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. పెన్షన్ బకాయిలు అందక ఇప్పటికే 83 మంది మరణించారని పేర్కొన్నారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి కనీస కనికరం కూడా లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.