సాగు, తాగునీటికి అల్లాడుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు గోదారమ్మ ఉప్పొంగి వచ్చింది. మెట్టప్రాంత భూములను తడిపేందుకు పరుగులు తీస్తూ సముద్ర మట్టానికి దాదాపు 420మీటర్ల ఎత్తులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయరులోకి వచ్చి చేరింది. హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయరు పూర్తయి ట్రయల్న్ విజయవంతమైంది. దశాబ్దాల కల సాకారం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కిందని సంబుర పడుతున్నారు. గోదావరి నీళ్లు తొలి ఏకాదశి పండుగ రోజున గురువారం ఈ గడ్డను ముద్దాడాయి. దీంతో రైతుల్లో ఆనందం మిన్నంటింది.
కాలం కలిసి వస్తేనే పంట.. లేకపోతే వలస వెళ్లే దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న మెట్ట ప్రాంతం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల వెతలు ఇక తీరనున్నాయి. గోదావరి జలాలు రావడంతో తమప్రాంతం సస్యశ్యామలం కానున్నదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయరును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిద్దిపేట, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల గ్రామాలకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. గురువారం గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీటిని విడుదల చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఒకటో పంపును ఆన్ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి వదిలారు. సుమారు 2 నుంచి 3టీఎంసీల వరకు నీటిని ప్రస్తు తం నింపనున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపక్షాలు అడగడుగునా అడ్డంకులు సృష్టించాయి. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారు. వాటిన్నింటిని అధిగమించి ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి నీటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
స్వరాష్ట్రంలో సామర్థ్యం పెంపు..
జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టును ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద 2008 -09 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి నీటిని ఎస్సారెస్పీ ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్‌మానేరుకు వచ్చి, అక్కడి నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గౌరవెల్లి లిఫ్ట్ కెనాల్ ద్వారా నింపేలా ప్రణాళిక చేసి 2008-09లో గౌరవెల్లి ప్రాజెక్టును మొదలు పెట్టారు. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు దీని సామర్థ్యం 1.41 టీఎంసీలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణ సామర్థ్యం తక్కువగా ఉందని గుర్తించిన సీఎం కేసీఆర్ రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. దీంతో 2015లో గౌరవెల్లి సామర్థ్యం 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచారు. దీంతో ఆ మేరకు భూసేకరణ చేయడంతో ముంపు గ్రామాలకు కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించి మెట్ట ప్రాంతా న్ని సస్యశ్యామలం చేయడం కోసం యుద్ధ్దప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామం వద్ద గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించారు. గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, సోమాజీతండా, సేవ్యనాయక్ తండా, బోంద్యానాయక్ తండా, జలుబాయి తండా, చింతల్ తండా,తిరుమల్ నాయక్ తండాలు ముంపునకు గురయ్యాయి. గౌరవెల్లి, జనగామ, రేగొండ, గండిపల్లి, నం దారం గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. రీడిజైనింగ్‌లో భాగంగా వరద కాల్వ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని, కాల్వల ప్రవాహ సామర్థ్యాన్ని, పంపుల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచింది.
మిడ్‌మానేరు నుంచి నీళ్లు…
మిడ్ మానేరు నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి వస్తున్నాయి. తోటపల్లి నుంచి నార్లాపూర్ వరకు 8 కిలోమీటర్ల లింక్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి గొట్లమిట్ట వరకు అప్రోచ్ కెనాల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా రేగొండ పంప్‌హౌస్‌కు గోదావరి జలాలు చేరుకుంటాయి. రేగొండ వద్ద ఏర్పాటు చేసిన పంపుల ద్వారా నీటిని గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. 32 మెగావాట్స్ 3 మోటర్లు 126 మీటర్లు ఎత్తిపోసే విధంగా మహాబలి మోటర్లు బిగించారు. గురువారం ఒకటో నెంబర్ పంప్‌ను ఆన్ చేసి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తి పోశారు.
గౌరవెల్లి ప్రాజెక్టు ఆయకట్టు వివరాలు
గౌరవెల్లి కుడి ప్రధాన కాల్వ ద్వారా 90,000 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 16,000 ఎకరాలు, మొత్తం 1,06,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సిద్దిపేట, వరంగల్ అర్బన్, కరీంనగర్, జనగామ జిల్లాల రైతులకు సాగునీటితో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండల్లాలోని 57,852 ఎకరాలకు సాగునీరు అందనున్నది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని వేలేరు, ధర్మసాగర్, భీమదేవరపల్లి, ఖాజీపేట, చిల్పూర్, స్టేఫన్ ఘనపూర్, రఘునాథపల్లి, జాఫర్‌గఢ్ మండలాల్లోని 48,148 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తంగా గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. గౌరవెల్లి కుడి, ఎడమ ప్రధాన కాల్వలది పోను, మిగతా 14వేల ఎకరాలకు గండిపల్లి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగు నీరు అందిస్తారు.
నీళ్లగోస తీరినట్లే!
కోహెడ జూన్ 30: నాకు మూడు ఎకరాల భూమి ఉంది. వానలు పడితే పంటలు పండుతాయి లేకపోతే అంతే. ఏండ్లబడి ఇదే గోస. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే సంబుర పడ్డ. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సారు హుస్నాబాద్‌కు వచ్చి ఇక్కడ కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కట్టిస్తా అన్నడు. ప్రాజెక్టు కట్టించిండు. మాట తప్పలే. నిన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ట్రయల్ రన్ షురూ చేసిండు. ఇక నీళ్ల గోస తీరినట్లే. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
– బైరి నర్సయ్య, రైతు, కోహెడ
మెట్ట ప్రాంతం ఇక సస్యశ్యామలం
హుస్నాబాద్, జూన్ 30: కరువు కాటకాలతో నిత్యం అల్లాడుతూ కనీసం తాగునీరు దొరకని పరిస్థితుల్లో ఉన్న హుస్నాబాద్ మెట్ట ప్రాంతం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వల్ల కొంత బాగుపడినప్పటికీ సరైన సాగునీటి కోసం రైతులు తిప్పలు పడేవాళ్లు. ఐదు దశాబ్దాలుగా గోదావరి నీళ్ల కోసం ఎదురు చూసిన ఈ ప్రాంత రైతుల కల గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంతో సాకారమైంది. తెలంగాణ రాక ముందు పశువులకు గడ్డికూడా దొరకని పరిస్థితుల నుంచి ఇతర ప్రాంతాలకు కేవలం పశుగ్రాసమే కాదు, అన్నిరకాల పంటలు ఎగుమతులు చేసే స్థితికి చేరుకోబోతున్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంతో ఇక సస్యశ్యామలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సారవంతమైన భూములు, ఆరుగాలం కష్టపడే రైతులు ఉన్న ప్రాంతం కాబట్టి పుష్కలంగా సాగునీరందితే ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండిస్తారు. వచ్చే కొద్ది రోజుల్లోనే హుస్నాబాద్ నియోజకవర్గ ముఖచిత్రం మొత్తం మారిపోనున్నది. కుర్చీ వేసుకొని గౌరవెల్లిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ కృషి, మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రుల సహకారంతో ఎట్టకేలకు గౌరవెల్లికి గోదారమ్మ చేరింది. ఈ ప్రాంత ప్రజలు, రైతుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు.
– వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
గౌరవెల్లి డ్యామ్చూస్తమని అనుకోలే
హుస్నాబాద్ టౌన్, జూన్ 30: మా చిన్పప్పటి నుంచి ఇంటున్నం. డ్యామ్ వస్తుందని, ఎలచ్చన్లు రాగానే గోడలమీద రాసేది. మాతోనే వస్తదని. కానీ, గిన్నేండ్లనుంచి సూతన్నం. ఎవ్వలు సెయ్యలేదు. డ్యామ్ రాకుండా అప్పటి వరంగల్ జిల్లా కాంగ్రెసొల్లు అడ్డుకున్నరు. లేకుంటే ఎప్పుడో అయిపోవు.. కాలం కావాలే… మీదికెల్లి వరదల రావాలే చెర్లునిండాలే.. పంటలు పండాలని అనుకునేది. గిప్పుడు సీఎం కేసీఆర్ డ్యామ్ ఏర్పాటు చేయించాడు. డ్యామ్ నీళ్లు వత్తన్నయి అని సెప్పుతండ్రు. గౌరవెల్లి చూడటానికి పోవాలని అనుకుంటున్న. సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం కూడా చూసివచ్చిన. నీళ్లను తీసుకువచ్చినోడే గొప్పోడు.
-అయిలేని రాజిరెడ్డి, రైతు, హుస్నాబాద్
సీఎం కేసీఆర్ వచ్చినంక అయింది
హుస్నాబాద్‌టౌన్, జూన్ 30 : వరదకాల్వకు 30ఏండ్ల కిందట పెద్దపల్లిలో రాయివేసిండ్రు. గిప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు అయిపోయినవి. ఎవ్వలు వచ్చినా తాపకింత పనైతదని అనుకున్నం. కానీ,గిట్ల తొందరనే అయితదని ఎన్నడూ అనుకోలే. ప్రాజెక్టుల నీళ్లు ఉంటే రెండు పసల్లు కాదు.. మూడు పసల్లు కూడా పంటలు పండుతాయి. నీళ్లులేక చంద్రబాబు హయాంలో అరిగోసపడ్డం. ఎవుసం సక్కగసాగలేదు. రెండుదొయ్యలు పారించుకోని బతికేది. మా చుట్టుపక్కల ఎవ్వల బాయిచూసినా బండనే. అట్లంటి మనమెట్ట భూములకు గౌరవెల్లి నీళ్లు ఇస్తే మంచి పంటలు పండుతాయి. ఎం చేసినా సీఎంకేసీఆర్ అనుకుంటే సెత్తడనే నమ్మకం ఉంది.
– ఆశయ్య, రైతు, హుస్నాబాద్
కేసీఆర్ మాటంటే మాటే
కోహెడ జూన్ 30: కేసీఆర్ సారు మాటంటే మాటే. హుస్నాబాద్ నియోజకవర్గం గురించి బాగా తెలుసు. హుస్నాబాద్‌కు వచ్చినప్పుడు రైతుల గోస చూసి ప్రాజెక్టు కట్టిస్తా అన్నారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పనులు చేపిచిండు. 10 రోజు ల్లో సీఎం కేసీఆర్‌తో ప్రారంభిస్తానని చెప్పాడు.
– జె.వెంకటరామారావు,రైతు, కోహెడ