చేర్యాల, జూలై 7 : కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రజలు తాగునీటి కోసం తండ్లాట పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు(మొండిచింత కాలనీ)లో తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీలు, సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని కాలనీకి చెందిన మహిళలు సోమవారం నీటిని సరఫరా చేసే నల్లా వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఖాళీ బిందెలతో కలెక్టరేట్‌కు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో పాటు మొండిచింతకాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో జాతీయ రహదారిలో వంటావార్పు చేస్తామని అధికారులకు తెలియజేశారు. కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు రెండేండ్లుగా మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. దీంతో పాటు చిన్న నీటి ట్యాంకు ద్వారా నీరు సరఫరా అవుతుండడంతో వచ్చిన నీటినే వాడుకుని తమ అవసరాలను వెళ్లదీసుకుంటున్నారు. చిన్ననీటి ట్యాంకు నీటిని సరఫరా చేసే బోరుమోటరు రెండు నెలల క్రితం కాలిపోవడంతో దానిని సంబంధిత శాఖ అధికారులు మరమ్మతులు చేయడం లేదు. దీంతో కాలనీవాసులు తాగునీటి కోసం వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది.