అందోల్, మే 21: రైతుల నుంచి ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి హెచ్చరించారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘రైతుల కష్టం నీళ్లపాలు’ అనే కథనానికి కలెక్టర్ స్పదించారు. మంగళవారం స్థానిక అధికారులతో కలిసి అందోల్, కన్‌సాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసున్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే కొంతమంది సిబ్బంది ఇష్టా రాజ్యంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారని, పైరవీకారులకు పెద్ద పీటవేస్తూ సామాన్య రైతులను పట్టించుకోవడంలేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాత్రనకా..పగలనకా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని, మీరైనా దయ తలిచి ధాన్యం త్వరగా కొనేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉదయం కేంద్రాలు ఓపెన్‌చేసి సేకరణ వేగంగా పూర్తిచేయాలన్నారు. గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలన్నారు. ప్రతిరోజు ఐదు లారీల్లో ధాన్యం తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొంటామని, రైతులు అధైర్య పడొద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
మిల్లర్లు సైతం రైతులకు అండగా ఉండాలని, ఇచ్చిన కెపాసిటీని పూర్తిచేసి రైతులకు తమవంతు సహకారం అందించాలన్నారు. మిల్లులో స్పేస్(స్థలం) పెంచుకుని లారీలను వెంటనే అన్లోడ్ చేయించడంతో, పాటు వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రతి సెంటర్లో సంబందిత నిర్వాహకులు, సిబ్బంది అందుబాటులో ఉండి వరుస క్రమంలో ధాన్యం కొనాలన్నారు. సంచులు, లారీల కొరత, ఇతరత్రా సమస్యలు ఉంటే రైతులు నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అనంతరం అందోల్ బాలుర, బాలికల పాఠశాల, అన్నాసాగర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.అందోల్ బాలికల పాఠశాలను కలెక్టర్ విజట్ చేసిన సమయంలో హెచ్ఎం, కొంతమంది టీచర్లు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్తే తెలంగాణలో వార్త ప్రచురితం కావడం, వెంటనే కలెక్టర్ రావడంతో మంగళవారం ఆగమేఘాల మీద కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు ప్రత్యక్షమై ధాన్యం లోడు చేయడం కనిపించింది. పాఠశాలను సందర్శించేందుకు వస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చినా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అంటూ డీఈవో ఫిర్యాదు చేయగా.. సంబంధిత హెచ్ఎంకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో పాండు, సివిల్ సైప్లె మేనేజర్ కొండల్రావు, పౌరసరఫరాల అధికారి వనజాత, మెప్మా పీడీ గీత, ఏడీఏ అరుణ, ఏవో విజయరత్న తదితరులు పాల్గొన్నారు.