గజ్వేల్, మే 11: కార్పొరేట్లకు కొమ్ము కాస్తు ప్రధాని నరేంద్రమోదీ పేదలపై భారం మోపుతున్నారని, దేశాన్ని ఆర్థికంగా తిరోగమన దిశలో నడిపిస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పర్యటనలో బంగారం కొనొద్దు, పెట్రో, డీజిల్ వాడకం తగ్గించాలి, తినే ఆయిల్స్ వాడొద్దంటూ ప్రధాని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. బంగారం, డీజిల్,పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు.
ముందుచూపు, తగిన ప్రణాళకలు లేకపోవడంతో మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.రూపాయి విలువ పతనం కావడంతోనే ధరలు పెరుగుతున్నాయని, డాలర్ విలువ పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిందన్నారు. మోదీ పాలనలో ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారా…బీజేపీలో ఉన్నారా గుర్తెరగాలన్నారు. రాహుల్‌గాంధీ ప్రాంతీయ పార్టీలతో చెతులు కలిపితే తెలంగాణలో రేవంత్‌రెడ్డి జాతీయ పార్టీతో జతకట్టారని, ప్రధాని మోదీ మాటలతో తేటతెల్లం అయ్యిందన్నారు.
రెండు జాతీయ పార్టీలు బాహాటంగా ఒక్కటయ్యాయని, వీళిద్దరి టార్గెట్ కేసీఆర్ అని, బీజేపీ,కాంగ్రెస్‌ను తెలంగాణ బిడ్డలే బొంద పెట్టడం ఖాయమన్నారు. రెండున్నరేండ్ల కాలంలో తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చేసింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు రిబ్బ న్ కట్టింగ్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు కాళేశ్వరం, సీతారామ, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల్లో ఒక్కదానికి జాతీయ హోదా తేలేక పోయారని, ప్రధాని చేత తమ్మిడిహట్టి వద్ద పనులకు కొబ్బరికాయ కొట్టించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బెండే మధు, నవాజ్‌మీరా, బొల్లారం ఎల్లయ్య, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీధర్, మురళి, నాయకులు కృష్ణారెడ్డి, రవీందర్, నర్సింగరావు, శివకుమార్, బీమప్ప, సురేశ్, కనకసేనా, పోచయ్య, ప్రతాప్‌రెడ్డి, ఉమార్, అహ్మద్, స్వామిచారి, నరేందర్ పాల్గొన్నారు.