హుస్నాబాద్, సెప్టెంబర్ 5: ఖమ్మంలో లేని యూరియా కొరత హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రశ్నించారు. అక్కడి వ్యవసాయశాఖ మంత్రి చొరవతో పెద్దమొత్తంలో ఖమ్మం జిల్లాకు యూరియా తరలిస్తుంటే ఇక్కడ మంత్రిగా ఉన్న పొన్నం మాత్రం యూరియా తెప్పించడంలో విఫలమవుతున్నాడని విమర్శించారు. నెల రోజులుగా యూరియా లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, రాత్రీ పగలు అనే తేడా లేకుండా పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టం మంత్రికి కనిపించక పోవడం దారుణమన్నారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014-2023వరకు ఏనాడు కూడా రైతులు యూరియా కోసం క్యూ కట్టడం గానీ, ఎదు రు చూడటం కానీ జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏటా సాగవుతున్న 1.67లక్షల ఎకరాలకు సరిపడా యూరియా అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సరైన సమయంలో యూరియా అందకుంటే పంట దిగుబడులు పూర్తిగా పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సకాలంలో యూరియా తెప్పించకుంటే రైతులతో కలిసి చేయబోయే ఆందోళనలకు మంత్రి పొన్నం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, మాజీ వైస్చైర్ర్సన్ అయిలేని అనితారెడ్డి, మాజీ ఎంపీపీ లకావత్ మానస, మాజీ జడ్పీటీసీ బీలూనాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ రజనీతిరుపతిరెడ్డి, లింగాల సాయన్న, బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు వెంకట్రాంరెడ్డి, వాల సుప్రజ, శంకర్‌రెడ్డి, భాగ్యరెడ్డి, బొల్లి శ్రీను, రామకృష్ణ, రవీందర్రావు, రమణారెడ్డి, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రాల సార య్య, లక్ష్మణ్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, విజయభాస్కర్, వికాస్‌యాదవ్, సదానందం, రాజునాయక్ పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.