గుమ్మడిదల, ఫిబ్రవరి 8: “హైదరాబాద్ చెత్తకంపు ప్యారానగర్‌కు ఎందుకు.. మా పచ్చని అడవులు, పంటలను నాశనం చేసి మాబతుకులతో ఆటలాడుకుంటారా..? అంటూ ప్రజలు ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. సీపీఎం నాయకులు ఆందోళనకు సంఘీభావం తెలిపారు. శనివారం సంగారెడ్డిజిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో కొత్తపల్లి, నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డుకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.
బాధిత గ్రామాల ప్రజలు నల్లవల్లి కేంద్రంగా ఆందోళన చేయడంతో సీపీఎం నాయకులు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు కె.రాజయ్య, మానిక్, ఎం. నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వర్రావు, పటాన్చెరు సీనియర్ నాయకుడు వాజిద్‌అలీ ఆందోళనకు సంఘీభావం తెలిపారు. రోడ్డుపై గంటల తరబడి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపాధి లేకుండా చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ ..నాలుగు రోజుల నుంచి డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, జిల్లా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.ఇక్కడి ప్రజల జీవితాలను నాశనం చేయవద్దని, రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్‌రావు పర్యవేక్షణలో నల్లవల్లి,ప్యారానగర్ గ్రామాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు.
పోలీస్‌ల వలయంలో డంపింగ్‌యార్డు పనులు
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్‌యార్డు పనులు కొనసాగుతున్నాయి. పోలీసుల వలయంలో ఎవరినీ రాకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. పోలీస్ అధికారులు.. రాత్రి సమయంలో జీహెచ్ఎంసీ నుంచి టిప్పర్లు నడుస్తున్నాయి. టెంట్లు వేసుకుని కూలీలతో ప్రహరీ, బంకర్ల పనులు చేయిస్తున్నారు. గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, అన్నారం, నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల్లో పోలీసులు టెంట్లు వేసుకుని పహారా కాస్తున్నారు. ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
13న ప్యారానగర్లో భూసర్వే
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్యారానగర్లో భూసర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ ప్రకటనలో తెలిపారు. మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్‌లోని 2,3,4, 27,29,35,36, 39,40,41, 44 సర్వే నంబర్లలోని భూముల్లో ఈ నెల 13వ తేదీన మండల సర్వేయర్చే సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గంగాభవాని, నాయబ్ తహసీల్దార్ కరుణాకర్‌రావు తెలిపారు. ఈ సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తుదారులు, ఆసక్తిగలవారు, చుట్టు పక్కల రైతలు హాజరుకావాలని వారు సూచించారు.
నర్సాపూర్ చౌరస్తాలో విద్యార్థుల రాస్తారోకో
నర్సాపూర్,ఫిబ్రవరి 8: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డును వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా విద్యార్థులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. మాకొద్దు మాకొద్దు డంపింగ్ యార్డు అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డంపింగ్‌యార్డు ఏర్పాటుతో నర్సాపూర్ రాయారావు చెరువుపూర్తిగా కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని అడవి తల్లి నిర్మానుష్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుకు నర్సాపూర్ పట్టణం సమీపంలో ఉండడంతో దుర్వాసన వస్తుందని, పైగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలన చేసి డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
2009లో డంపింగ్‌యార్డు ఒప్పందం
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో చెత్త రోజురోజుకూ పెరిగిపోతుండడంతో మహానగరం నలుదిక్కుల డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.. 2009లోనే అప్పటి కాంగ్రెస్ సర్కారు హయాంలోనే జవహర్‌నగర్ చెత్తను తగ్గించడానికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ అటవీప్రాంతంలో, పటాన్‌చెరులోని లక్డారంలో ఏర్పాటు చేయాలని టెండర్‌ను దక్కించున్నాం. ఆ ఒప్పందం అమలులో భాగంగా ప్యారానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తున్నాం. 2014లో తెలంగాణ ఏర్పాటుకు ముందే డంపింగ్‌యార్డు నిర్మాణం జరగాల్సింది. కానీ అప్పటి తెలంగాణ ఉద్యమం వల్ల పాలకులు ఆకార్యక్రమాన్ని పక్కన పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రెవెన్యూ విభాగం ప్యారానగర్ స్థలాన్ని రాంకీ సంస్థకు అప్పగించింది. 2015 నుంచి 2023 వరకు ఆలస్యం కావడానికి కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడమే కారణం . 2023లో కేంద్ర అటవీ శాఖ అనుమతులు లభించగానే కాలుష్య నియంత్రణబోర్డుతోపాటు మిగతా అన్ని శాఖల నుంచి ప్యారానగర్ డంపింగ్‌యార్డు నిర్మాణానికి వెంటవెంటనే అనుమతులు లభించాయి.
– శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్