సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 17: గ్రామంలోని నల్లకుంట చెరువు నీరు పూర్తిగా విషపూరితంగా మారిందని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద వారు నిరసన చేపట్టారు. కాలుష్యం బారి నుంచి కాపాడాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. నల్లకుంట చెరువు నుంచి తెచ్చిన కాలుష్య జలాలను అధికారుల ముందు పోసి వాసన చూడాలని, ఆ నీటిని తాకాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రసాయన పరిశ్రమలతో అధికారులు కుమ్మక్కై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రసాయన పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్య జలాలు చెరువులో చేరి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. ప్రజలు, పశువులు రోగాల బారిన పడుతున్నామని, కాలుష్య నియంత్రణ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. కాలుష్య జలాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ సంఘాల నాయకులు వై.అశోక్ కుమార్, ప్రభు గౌడ్ తదితరులు సంఘీభావం తెలిపారు.