పటాన్చెరు రూరల్, జూలై 6 : తమవారి బూడిదనైనా ఇవ్వండి సారు అంటూ సిగాచి పేలుడులో గల్లంతైన వ్యక్తుల కుటుంబ సభ్యు లు అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ పేలుడులో మిస్సింగ్ అయిన వారి జాడకోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఆదివారం మూడు కుటుంబాలకు చెందిన వ్యక్తులు రోదిస్తూ అధికారులకు మొరపెట్టుకున్నారు. సిగాచి మృతుల సంఖ్య అధికారికంగా 42కి చేరింది.
ఇంకా 8మంది ఆచూకీ లభించాల్సి ఉంది. డీఎన్ఏలో ఎముకలతో మ్యాచ్ అయిన చికెన్ సింగ్ కుటుంబానికి మృతదేహాన్ని అధికారులు అప్పగించారు. ఇప్పుడు ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది. ఏడు కుటుంబాల సభ్యులు అధికారుల వద్దకు వస్తూ తమవారి జాడకోసం అడుగుతున్నారు. తమవారు బతికున్నట్టుగా ఆశలేవి లేవని, కనీసం వారి శరీరం ఆనవాళ్లు ఇస్తే తీసుకెళ్లి అంత్యక్రియలతో పాటు దశ దినకర్మ చేసుకుంటామని బతిమాలుతున్నారు. ఏడు రోజులుగా అక్కడే ఉండటంతో తమ ఇండ్లవద్ద నుంచి ఫోన్లు వస్తున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన చిన్నారావు తన కుమారుడు వెంకటేశ్ (28) ఆనవాళ్లు అప్పగించమని ఏడు రోజులుగా అధికారుల వద్దకు వెళ్లి వేడుకుంటున్నాడు. గుర్తుపట్టని మృతదేహాల ఆనవాళ్ల కోసం డీఎన్ఏ టెస్టు శాంపిల్ ఇచ్చాడు. ఆ శాంపిల్ ఏ శవంతోనూ మ్యాచ్ కాలేదు. కనీసం తన కుమారుడి బూడిదనైనా ఇవ్వాలని భావోద్వేగానికి గురయ్యాడు. తన తమ్ముడు మహేశ్‌ను రప్పించి డీఎన్ఏ శాంపిల్ అధికారులకు ఇచ్చాడు. వచ్చే రిజల్ట్‌ను బట్టి అతడికి మృతదేహం లభించవచ్చు. లేదా లభించకపోవచ్చు. మరో పక్క బండ్లగూడకు చెందిన జస్టిన్ (20) అనే కార్మికుడి కోసం అతడి కుటుంబం మొత్తం ఏడు రోజులుగా హెల్ప్‌డెస్క్ ప్రాంగణంలోనే ఉంటున్నారు.
తండ్రి రాందాస్ తన రక్తపు శాంపిల్స్ డీఎన్ఏ టెస్టులకు ఇచ్చాడు. ఏడు రోజులుగా ఇక్కడే ఉంటున్నా అధికారులు మా జస్టిన్ శవాన్ని అప్పగించడం లేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. జస్టిన్ సోదరీమణులు కన్నీటి పర్యంతమై అధికారులను వేడుకుంటున్నారు. జార్ఘండ్‌కు చెం దిన జుమ్మేరాత్ మియా తన కుమారుడు సిగాచి పేలుడులో గల్లంతయ్యాడని విని హుటాహుటిని ఫ్లైట్‌లో తన గ్రామ సర్పంచ్‌ను తీసుకుని పాశమైలారం వచ్చాడు. దినసరి కూలీ గా పనిచేసే జుమ్మేరాత్ మియా కొడుకు కోసం విమానంలో ఖర్చు చూడకుండా వచ్చాడు.
హెల్ప్‌డెస్క్ వద్ద అధికారులు మృ తదేహానికి డీఎన్ఏ మ్యాచ్ అయితే అందజేస్తామని తెలుపుతున్నారు. మూడు రోజులుగా కొడుకు మృతదేహం కాని, ఆచూకీ కాని అతనికి లభించడం లేదు. అధికారులు మాత్రం డీఎన్ఏ టెస్టులు చేపించి మ్యాచ్ అయినవాటినే అప్పగించాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. డీఎన్ఏ మ్యాచ్ కానప్పుడు శవాలను ఇవ్వడం కుదరదని తెలుపుతున్నారు. ప్రభుత్వ పరంగా అక్కడ ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భోజనం, టిఫిన్లు అందజేస్తున్నారు. కా నీ, బాధితులకు తమవారి మృతదేహమైనా చూడాలని నిరీక్షిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.