న్యాల్కల్, ఫిబ్రవరి 15: రాఘవాపూర్ గ్రామ శివారులోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వసంత పంచమి వేడుకల్లో భాగంగా రెండో రోజు గురువారం క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో సరస్వతీదేవికి అభిషేకం, కుంకుమార్చన, సరస్వతీ యాగం, హారతి తదితర పూజలను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సరస్వతీదేవి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఊరేగించారు. ప్రధాన అర్చకుడు అయ్యప్పస్వామి ఆధ్వర్యంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మహిళల పాటలు, భజన కీర్తనల మధ్య డోలారోహణం, భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పవిత్రమైన మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాత, సరస్వతీ అమ్మవారితో పాటు సూర్యభగవాన్, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. పంచవటీ క్షేత్రంలో శుక్రవారం నిర్వహించే రథసప్తమి వేడుకలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యభగవాన్ స్వామి చిత్రపటాన్ని రథంపై ఏర్పాటు చేసి ఊరేగించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతీదేవి, సూర్యభగవానుడి కృపకు పాత్రులు కావాలని పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా కోరారు.