సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 9: ప్రభుత్వ పాలసీల రూపకల్పనలో నైతిక విలువలకు, ప్రజాభిప్రాయాలకు పెద్దపీట వేయాలని మహారాష్ట్రలోని యశ్వంత్‌రావు ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ మయూనందన్ పిలుపునిచ్చారు. ‘పబ్లిక్ పాలసీని రూపొందించడంలో సామాజిక శాస్ర్తాల పాత్ర -బహుళ విభాగ దృక్పథం’అనే అంశంపై బుధవారం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల సామాజిక విభాగాల ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేస్ఎస్ రత్నప్రసాద్ అధ్యక్షతన జాతీయ సెమినార్ నిర్వహించా రు.
తొలిరోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మయూనందన్ మాట్లాడారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఏజీవో ప్రొఫెసర్ బాల భాస్కర్ మాట్లాడుతూ.. విధాన రూపకల్పనలో సామాజిక శాస్ర్తాలన్నింటికీ ప్రాధాన్యత ఉందని, వాటితో పాటు సాంకేతికతను జోడించాల్సిన అవసరం ఉందన్నారు. కీనోట్ స్పీకర్‌గా వ్యవహరించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీ య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నజీవుల్లా మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాలన్నీ పబ్లిక్ పాలసీపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయని, పబ్లిక్ పాలసీ అమలు లో మీడియా, టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉన్నందున అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని విద్యార్థులతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో మరో గౌరవ అతిథి ప్రొఫెసర్ పవిత్ర, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేస్ఎస్ రత్నప్రసాద్, సెమినార్ కన్వీనర్ డాక్టర్ మల్లిక, డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్, కోకన్వీనర్ డాక్టర్ జోత్స్న, కార్యదర్శి డాక్టర్ అనురాధ, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.