వర్గల్ /సంగారెడ్డి, జనవరి 24: వర్గల్ గిరి నివాసిని సరస్వతీ మాత ఏటేటా జరిగే వసంత మహోత్సవానికి ముస్తాబైంది. ఆలయ పరిసరాలు విద్యుత్ దీప కాంతుల్లో వెలిగిపోతున్నాయి. ఈ నెల 26 జరిగే శ్రీ పంచమి సందర్భంగా ఆలయానికి తరలివచ్చే భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వర్గల్ శనైశ్చరాలయ వ్యవస్థాపక శాశ్వత చైర్మన్ శ్రీయాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి తెలిపారు. వేడుకల సందర్భంగా ఆలయ పాలకవర్గం పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలతోపాటు పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలను అందజేశారు.
సికింద్రాబాద్ నుంచి..
శ్రీపంచమి దృష్ట్యా ఈ నెల 26న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వర్గల్ సరస్వతీ మాత ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గురువారం ఉదయం 5 నుంచి రాత్రి 10.15 గంటల వరకు అరగంటకో బస్సు ఉంటుందని హకీంపేట డిపో మేనేజర్ తెలిపారు.
ప్రత్యేక బస్సులు : వసంత పంచమి వేడుకలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని మెదక్ రీజినల్ మేనేజర్ సుదర్శన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ రీజియన్, సిద్దిపేట్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోల నుంచి భక్తులకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. జూబ్లీ బస్టాం డ్ నుంచి వర్గల్‌కు రూ.70లు, సిద్దిపేట నుంచి వర్గల్‌కు రూ.70లు, గజ్వేల్ నుంచి వర్గల్‌కు రూ.30లు, గౌరారం కమాన్ నుంచి వర్గల్‌కు రూ.20ల ప్రయాణికులు తక్కువ చార్జీలతో చేరుకోవచ్చు. వివరాలకు ఆయా డిపోల మేనేజర్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ 9959226270, సిద్దిపేట డిపో మేనేజర్ 9959226271 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆర్ఎం సూచించారు.