గజ్వేల్, జూలై 2: రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, సమాధానం చెప్పలేక ఉల్టా ఫల్టా మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రులు తోకముడిచి, పోలీసులను అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి హరీశ్‌రావును అరెస్టు చేయించారని, తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టుల పర్వాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. గురువారం గజ్వేల్‌లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా ప్రతిపక్షాలపై అధికారపక్షం దాడులు చేస్తున్నదని మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్ వాస్తవాలు మాట్లాడుతున్నరని, వాస్తవం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సుమన్‌ను జైలుకు పంపారని గుర్తుచేశారు.
తెలంగాణ అప్పుల పాలైందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, కేసీఆర్ హయాంలో చేసిన అప్పుతో కాళేశ్వ రం ప్రాజెక్టు, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెళ్ల్లు, మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పూడికతీత, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీళ్లు అందించామన్నారు. ఆ ఆస్తుల విలువ నేడు రూ.20 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లలో చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లతో ఏమి ఉద్దరించారో ప్రజలకు సమాధానం చెప్పాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
వసతి గృహాల టెండర్లలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడితే, రాష్ట్ర మం త్రుల్లో ఒకరు రూ.700 కోట్ల టెండర్ అని, మరొకరు రూ.1100 కోట్ల టెండర్ అని మాట్లాడుతున్నారని, వాళ్లలో వాళ్లకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు పంటలకు రైతుభరోసా ఎగ్గొటి, రూ.15వేలు ఇస్తామని ఇవ్వలేదని, బోనస్‌ను బోగస్ చేసిందని విమర్శించారు.
కేసీఆర్ రైతులకు రూ.5 లక్షల రైతుబీమా తీసుకొస్తే, కనీసం ప్రీమియం చెల్లించలేని దద్దమ్మ రేవంత్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. సిగాచి పరిశ్రమలో 55 మంది మృతి చెందింతే, ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తామని ప్రభుత్వం చేతులెత్తేసిందని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, నవాజ్, కౌన్సిలర్ శ్రీనివాస్, బాబు, శ్రీధర్, నాయకులు దేవీ రవీందర్, నర్సింగరావు, రవీందర్, దేవేందర్, ఖాసీం, గుంటుక రాజు, సంతోష్, హైదర్‌పటేల్, ఆర్కే శ్రీను, స్వామిచారి, హనుమంతరెడ్డి, పోచయ్య పాల్గొన్నారు.