జగదేవ్‌పూర్, అక్టోబర్ 9: అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేసిందని, పది నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్,బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నదన్నారు.
మహిళలకు రూ 2500 ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. బతుకమ్మ పండుగకు మహిళకు చీరలు ఇవ్వడం లేదన్నారు. రైతుభరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదని, పంట రుణాలు సగం మందికి కూడా సరిగ్గా కాలేదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా తులం బంగారం ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదింటి గూడు చెదరగొట్టి, పండుగ రోజుల్లో వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిందన్నారు. కేసీఆర్‌పై కక్ష గట్టి సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి కొండసురేఖ, మైనంపల్లి హనుమంతారావును ఎగదోస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. అంతకు ముందు జగదేవపూర్‌లో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు యాదవరెడ్డి, మాజీ ఎంపీటీసీ కవిత, పార్టీ గ్రామ అధ్యక్షుడు బుద్ద నాగరాజు, నాయకులు కనకయ్య, భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.