జగదేవ్‌పూర్, మార్చి 20: పదివేల కోట్ల రూపాయలతో గజ్వేల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని, కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. గురువారం జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గొల్లపల్లి శివారులో పెండింగ్ కాలువ పనులను మండల నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నిర్మించి గజ్వేల్ నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు నీళ్లు అందించారన్నారు.
జగదేవపూర్ మండలంలో 99శాతం కాలువ పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన ఒక్కశాతం పనులు పూర్తిచేయడం లేదని విమర్శించారు. మునిగడప వద్ద కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. మునగడప చెరువులో భూగర్భ జలాలు అడుగంటి చుట్టుపక్కల 15 గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకొని మండలంలోని మునిగడప చెరువును నింపేలా ఆదేశాలు ఇవ్వలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. గజ్వేల్‌లో ఇరిగేషన్ కార్యాలయాన్ని కొడంగల్ తరలించారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి కలెక్టరేట్ నుంచి రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. వేల కోట్లతో గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్ ప్రాంతంలో అందరి రైతులకు పంట రుణమాఫీ చేయాలని, అందరికీ రైతు భరోసా ఇవ్వాలని పాదయాత్ర చేయాలని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు రంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, కవిత, చంద్రశేఖర్, మహేందర్, బాలకిషన్, శ్రీశైలం యాదవ్,అయిలయ్య, కిరణ్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.