గజ్వేల్, డిసెంబర్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా పల్లెల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, సంక్షేమం ఊసేలేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిధులు లేక పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసిందన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే రేవంత్ సర్కారు రైతులకు రూ.43 వేల కోట్ల పంట రుణమాఫీ చేయాల్సి ఉండగా, రూ.20 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నాదన్నారు. రైతుభరోసా రూ.7500 ఇస్తానని మాయమాటలు చెప్పి రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం అన్నదాతలను వంచించడమే పేర్కొన్నారు.
మహిళలకు మహాలక్ష్మి, కల్యాణలక్ష్మి తులం బంగారం, వితంతువులు, వృద్ధుల పెన్షన్ రూ.4 వేలకు పెంపు అన్నీ ఉత్తుత్తి మాటలేనని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ ఏడాదిలో రూ.లక్ష కోట్ల అప్పు మాత్రం చేసిండు. ఆ నిధులు దేని కోసం ఖర్చు చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే స్కాంలు, స్కీంలు, అవినీతి అక్రమాలకు ఆనవాలుగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలేసి, సీఎం కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.