గజ్వేల్, అక్టోబర్ 19: ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్, న్యూట్రీషన్‌ను కిట్లను అందించలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజవకర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్‌లోని మాతాశిశు దవాఖానను సందర్శించి గర్భిణులు, వైద్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతాశిశు దవాఖానలో పది రోజుల్లో అవసరమైన పరికరాలను సమకూర్చి పూర్తిస్థాయిలో సేవ లు వినియోగంలోకి తీసుకరావాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతామని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యాఆరోగ్య శాఖ మంత్రి రాజానర్సింహ దీనిపై దృష్టి సారించాలని కోరారు. కేసీఆర్ హయాంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గ కేంద్రాల్లో అత్యధునిక హంగులతో దవాఖానలను నిర్మించారని, గజ్వేల్‌లో రూ.28కోట్లతో మాతా శిశు దవాఖానను నిర్మించి రూ.10కోట్లతో ఒకటి, రెండు మినహా అన్ని రకాల పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు.
దవాఖానలో లేని పరికరాలను వెంటనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. గతంలో ఈ దవాఖానలో 80 శాతం సాధారణ ప్రసవాలు జరిగితే, నేడు ప్రసవాల సంఖ్య తగ్గిందన్నారు. మందులు ప్రైవేట్‌లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్ద్దీన్, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య, చందు, మల్లే శం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ కోఅప్షన్ సభ్యుడు అహ్మద్, నాయకులు ఆర్కే శ్రీను, భూపాల్‌రెడ్డి, కల్యాణ్కర్ శ్రీను, సాయి తదితరులు ఉన్నారు.