గజ్వేల్, మార్చి 7: మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలతో పాటు గజ్వేల్ పట్టణంలోని ఇండ్లులేని నిరుపేదల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మల్లన్నసాగర్ ముంపు బాధితులు, గజ్వేల్ పట్టణంలోని ఇండ్లులేని పేదలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్అండ్ఆర్ కాలనీలో శ్మశాన వాటిక, కబ్రస్థాన్ నిర్మాణం, గజ్వేల్ పట్టణానికి చెందిన అర్హులు 1156 మంది పేదలకు వెంటనే ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న కొండపోచమ్మ సాగర్ బాధితులకు ప్యాకేజీ, ఓపెన్ ప్లాట్లను తక్షణమే అందించాలన్నారు. హైకోర్టు ఆదేశాలమేరకు ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండ్ల స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 90శాతం పనులు పూర్తిచేయగా, మిగతా 10శాతం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయక చేతులెత్తేసిందని విమిర్శించారు. ప్యాకేజీ కింద వెంటనే రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే రంజాన్, ఉగాది పండుగల తర్వాత వేలాది మందితో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వందలాది ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళిగుప్తా, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ కౌన్సిలర్లు మెట్టయ్య, గోపాల్‌రెడ్డి, గుంటకు రాజు, చందు , కనకయ్య, రవీందర్, పంబాల శివ, శ్రీధర్, అత్తెల్లి శ్రీనివాస్, అల్వాల బాలేశ్, హైదర్ పటేల్, అహ్మద్, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.