గజ్వేల్, డిసెంబర్ 9: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు బయటపడుతాయని భయంతోనే అసెంబ్లీ హాల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుపడ్డారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ టీషర్టుపై అదానీ, మోదీ ఫొటోలు వేసుకొని పార్లమెంట్ లోపలికి వెళ్తే తప్పులేదు కానీ, తెలంగాణ అసెంబ్లీలో టీ షర్టులపై రేవంత్‌రెడ్డి, అదానీ బొమ్మలతో వెళితే తప్పేముందని ప్రశ్నించారు.
అదానీతో రేవంత్‌రెడ్డి చేసుకున్న ఒప్పందాలు బయటపెడుతారనే భయంతోనే అసెంబ్లీలోకి రాకుండా అడ్డుపడుతున్నరని, ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకునే ముందు దేశంలో కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలని రేవంత్‌రెడ్డికి హితువు పలికారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించాలనుకుంటున్న మూర్ఖత్వపు చర్యలను మానుకోవాలన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ప్రజలకిచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రైతులకు రూ.2లక్షల పంట రుణమాఫీ, మహిళలకు రూ.2500, స్కూటీల పంపిణీ, వృద్ధులకు పింఛన్ రూ.4వేలు, రైతుభరోసా రూ.7500 లాంటి పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని, తిట్ల పురాణం తప్పా చేసింది శూన్యం అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని వినిపించే ఒక్క ఎంపీ కూడా రాష్ట్రం నుంచి లేరన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు.
గడిచిన పదేండ్లలో తెలంగాణ అభివృద్ధి సాధ్యమయిందని, కేసీఆర్ ఆలోచన విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో పయనించిందన్నారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం కోసం ప్రజలు కేసీఆర్ వెంటే ఉండాలని కోరారు. కేసీఆర్ పదేండ్లలో ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీళ్లు అందించి రైతులకు అండగా నిలిచారని, ఆయన ఆనాడు నిర్మించిన ప్రాజెక్టుల ఫలాలతోనే రాష్ట్రంలో పుష్కలంగా ధాన్యం పండుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకీయోద్దీన్, నాయకులు కృష్ణారెడ్డి, విరాసత్ అలీ, దేవేందర్, గుంటుక రాజు, పాల రమేష్‌గౌడ్, అహ్మద్, ఉమార్ తదితరులు పాల్గొన్నారు.