గజ్వేల్, ఆగస్టు 18: గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం కేసీఆర్ ప్రభుత్వం బస్టాం డ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక పనులు ఆగిపోయినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి బస్టాండ్ల పనులు పూర్తిచేయించి అందుబాటులోకి తేవాలని కోరారు. స్పందించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గజ్వేల్‌లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని రూ.250 కోట్లతో కేసీఆర్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు.అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో గజ్వేల్ అభివృద్ధ్దికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నదన్నారు.
రోడ్లపై గుంతలను పూడ్చలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గజ్వేల్‌కు కేటాయించిన రూ.180కోట్లను రేవంత్‌రెడ్డి రద్దు చేసి కొడంగల్‌కు తీసుకెళ్లారని, ఆ నిధులు తిరిగి కేటాయించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాంగ్ చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ జడ్పీటీపీ ఎల్లయ్య, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ కౌన్సిలర్లు అర్చన, వరలక్ష్మి, నాయకులు రాజేశ్వర్‌రావు, ఏల వెంకట్, మన్నె వెంకట్, భిక్షపతి, మల్లేశం, సాయి పాల్గొన్నారు.