నాగల్గిద్ద, జూలై 31: మండలంలోని ఉట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నీటి సౌకర్యం లేకపోవడంతో దాదాపు నెల రోజులుగా మధ్యాహ్న భోజనం వండడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే అన్నం తెచ్చుకొని తింటున్నారు. పాఠశాలలో మొత్తం 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. బడికి భగీరథ పైప్‌లైన్ కనెక్షన్ ఉన్నప్పటికీ నీటిని సరఫరా చేయడం లేదు. పాఠశాల గ్రామానికి దూరంగా ఉండడంతో మధ్యాహ్న భోజన కార్మికులు నీటిని మోసుకురావడం భారమైందని మధ్యాహ్న భోజనం వండటం లేదు. ఈ విషయమై పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోధ్యాయుడు శంకర్‌ను అడగగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటి కొరత సాకుతో నేల రోజులుగా భోజనం పెట్టడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మధ్యాహ్న భోజనానికి నీళ్లు లేవని నెల రోజుల నుంచి వండుతలేరు. దీంతో ఇంటి నుంచే అన్నం తెచ్చుకొని తింటున్నాం. ఇంటికాడ మా అమ్మ స్కూల్లో భోజనం పెడ్తలేరా అని అడిగింది. నీళ్లు లేక వండుతలేరని చెప్పాను.
– కార్తీక్, 6వ తరగతి ప్రాథమికోన్నత పాఠశాల, ఉట్పల్లి