మెదక్, జనవరి 4 : గ్రామీణ ప్రాంత వాసులకు శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు( అటవీ ఉద్యానవనాలు) దోహదపడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అడవులను రక్షించడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలకు దగ్గరలో నిరుపయోగంగా ఉన్న రిజర్వు ఫారెస్ట్ బ్లాకులను ప్రజలకు ఉపయోగపడే విధంగా అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించి, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పార్కును ఒక్కో థీమ్‌తో మొత్తం 110 పార్కులను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, అందులో హెచ్ఎండీఏ పరిధిలో 55, ఇతర పట్టణాల్లో 50 అర్బన్ ఫారెస్ట్ పార్కులను రూపొందిస్తున్నది. కాగా, మెదక్ జిల్లాలో మూడు చోట్ల కొత్త పార్కులను సిద్ధం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో మరో మూడు అర్బన్ పార్కులు..
మెదక్ జిల్లాలో ఇప్పటికే నర్సాపూర్ అటవీ ప్రాం తంలో అర్బన్ పార్కు ఉండగా, కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలో మరో మూడు ఏర్పా టు చేస్తున్నారు. జాతీయ రహదారి శివారులో గ్రామీ ణ ప్రాంతవాసులకు పచ్చదనం, ఆహ్లాదకరమైన వా తావరణాన్ని కల్పించే ఉద్దేశంతో హెచ్ఏండీఏ పరిధిలోని వడియారం, మనోహరాబాద్, పరికిబండ ప్రాం తాల్లో ఈ అర్బన్ పార్కులను నిర్మిస్తున్నారు.
ఒక్కో పార్కులో 2 లక్షలపై చిలుకు మొక్కలు..
మెదక్ జిల్లాలోని వడియారం, మనోహరాబాద్, పరికిబండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కుల్లో 2 లక్షలకు పైగా అన్ని రకాల మొక్కలు నాటుతున్నారు. వడియారం అర్బన్ పార్కులో 3.60 లక్షల మొక్కలు, మనోహరాబాద్‌లో లక్ష, పరికి బండలో 2.50 లక్షల మొక్కలు నాటారు. వడియారంలో 528 హెక్టార్లలో, పరికిబండలో 880 హెక్టార్లలో, మనోహరాబాద్‌లో 129 హెక్టార్లలో ఆహ్లాదకరమైన అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేశా రు. ఈ పార్కుల్లో వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు క్యాంపింగ్ ఫెసిలిటీ, సాహసక్రీడలు, గజీబో తదితర సదుపాయాలను కల్పించారు.
త్వరలో ప్రారంభానికి సిద్ధం..
మెదక్ జిల్లాలోని వడియారం, పరికిబండ, మనోహరాబాద్ ప్రాం తాల్లో ఏర్పాటు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులను త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏ అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు. ముఖ్యంగా మొక్కలు నాటడం, ఫెన్సింగ్, సైక్లింగ్, గజీబోలతో పాటు వివిధ అభివృద్ధి పనులను చేస్తున్నారు. ఎప్పటికప్పుడు హెచ్ఎండీఏ పరిధిలోని అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
నేడు వడియారం పార్కును
సందర్శించనున్న శాంతకుమారి..
మెదక్ జిల్లాలోని వడియారం అర్బన్ ఫారెస్ట్ పార్కును బుధవారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతకుమారి సందర్శించి, పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. పనులు త్వరితగతిన పూర్తయితే మార్చిలో ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.