పొలాలు, చెరువులు, కుంటలకు అతి సమీపంలో క్రషర్లు, క్వారీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సమీపంలో క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేయడంపై రైతులు, స్థానిక ప్రజలు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసులు ఉన్నా, అధికారుల అండదండలతో యాజమాన్యాలు యథేచ్ఛగా పనులు ప్రారంభిస్తున్నాయి. దీంతో అధికారులు, ప్రభుత్వ తీరుపై రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిన్నారం జూన్ 20 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని రాళ్లకత్వ, శివానగర్ గ్రామాల పరిధిలో ఐదు వరకు కంకర క్రషర్లు నడుస్తున్నాయి. ఈ కంకర క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్ముధూళి, భారీ పేలుళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఊట్ల, దాదిగూడ గ్రామాల శివారులో నూతనంగా క్రషర్లు , క్వారీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకు వచ్చారు. 2022లో గ్రామాలకు సమీపంలో క్రషర్లు, క్వారీలు ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రషర్లు, క్వారీల ఏర్పాటును నిలిపివేసింది.
ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే గ్రామాల శివారులో క్వారీలు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. తాజాగా క్వారీ పనులు ప్రారంభించడంతో స్థానిక నాయకులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. క్వారీలు, కంకర క్రషర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేలుళ్లతో ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయి. పేలుడు సమయంలో దట్టమైన పొగలు గ్రామాలను కమ్మేస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న కంకర క్రషర్లతో అవస్థలు పడుతుంటే, తాజాగా కొత్త క్వారీలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలాలకు సమీపంలో క్రషర్లు, క్వారీలు ఉండటంతో పంటలు పండటం లేదు. పేలుడు సమయంలో రాళ్లు పంట పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. దీంతో పంట సాగు చేయడం రైతులకు కష్టంగా మారింది. చెరువులు, కుంటలు కాలుష్యమవుతున్నాయి. నీటిపై తెల్లటి మట్టి పేరుకుపోయి పనికిరాకుండా పోయింది. భారీ వాహనాలు నడుస్తుండటంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కంకర క్రషర్లు, క్వారీలతో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయా గ్రామాల రైతులు, నాయకులు, ప్రజలు ఇప్పటి వరకు హైకోర్టులో 50 వరకు కేసులు వేశారు.
మరికొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నా క్రషర్ల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నాయి. సమస్యలపై రైతులు, ప్రజలు గ్రామ స్థాయి అధికారి నుంచి సీఎం వరకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో రైతులు శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి గోడు వినిపించారు. ప్రధాన రహదారిపై ధర్నా చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్నాం
గ్రామానికి సమీపంలో క్వారీ ఏర్పాటు విషయంపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నాం. తాజాగా తమకు సమాచారం లేకుండానే క్వారీ పనులు ప్రారంభించారు. క్వారీ పనులు నిలిపేయాలని ఆందోళన చేపట్టడంతో పాటు అధికారులకు వినతి పత్రాలు అందించాం. తక్షణమే క్వారీ ఏర్పాటు పనులు ఆపాలి, లేనిపక్షంలో
ఉద్యమాలు చేస్తాం.
-ఆంజనేయులు, మాజీ సర్పంచ్ ఊట్ల (సంగారెడ్డి జిల్లా)
రైతులపై చిన్నచూపు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చిన్నచూపు చూస్తున్నది. గ్రామానికి అతిసమీపంలో క్రషర్లు ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ఇండ్లు కంపిస్తుండటంతో పాటు పగుళ్లు వస్తున్నాయి. అధికారులు సమస్యలు పరిష్కరించడం లేదు. నూతన క్రషర్లు, క్వారీలు ఏర్పాటు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
– ఆది రామకృష్ణ, రాళ్లకత్వ (సంగారెడ్డి జిల్లా)
ఎన్ని కేసులు వేసినా ఫలితం లేదు
క్రషర్లు, క్వారీల ఏర్పాటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి హైకోర్టులో అనేక కేసులు వేస్తూనే ఉన్నాం. మాకు తెలియకుండానే యజమానులు కేసులను వేకెట్ చేయించుకుంటున్నారు. కొన్ని కేసులు నడుస్తున్నా యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నాయి. క్వారీలు, క్రషర్ల ఏర్పాటుపై పోరాటం ఆగదు.
– శ్రీధర్, యువకుడు, రాళ్లకత్వ(సంగారెడ్డి జిల్లా )