గజ్వేల్, మే 19: మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కళ్లాల్లోరి ధాన్యం తడిసిముద్ధవుతున్నది. రైతుల నుంచి త్వరగా ధాన్యం సేకరించక పోవడంతో వర్షానికి వడ్లు తడస్తున్నాయి. రోజుల తరబడి ధాన్యం రోడ్లపైనే ఆరబెట్టడంతో ఆకాల వర్షాలకు తడిసిపోయి మొలకెత్తుతున్నది. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం ఆరేలోపునే మళ్లీ వర్షాలు కురవడం పరిపాటిగా మారింది. గజ్వేల్ మండలంలోని సింగాటం, అహ్మదీపూర్, కొల్గూర్, దిలాల్పూర్, బూరుగుపల్లి, శ్రీగిరిపల్లి, ధర్మారెడ్డిపల్లి, గిరిపల్లి, గ్రామాల సమీపంలోని రోడ్లపైన, గజ్వేల్ రింగ్రోడ్డుపైన వందలాది మంది రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని ఆరబెడుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరబెట్టిన ధాన్యాన్ని ఒక్క దగ్గరకు చేర్చేలోపే ఆకస్మాతుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసి పోతున్నది. గజ్వేల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతుల ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తడిసిన ధాన్యం రంగు మారుతోంది.
గజ్వేల్ మండలంలో పీఏసీఎస్ అధ్వర్యంలో 10, ఐకేపీ ఆధ్వర్యంలో మరో 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ, వీటిలో కొనుగోళ్లు వేగంగా సాగడం లేదు. ప్రజ్ఞాఫూర్కు చెందిన రైతు మర్కంటి నర్సింలు తనకున్న రెండు ఎకరాల్లో సన్నరకం వరిసాగు చేశాడు. గత బుధవారం వరికోత కోసి మరుసటి రోజు నుంచి వడ్లను గజ్వేల్ రింగ్‌రోడ్డుపై ఆరబెడుతున్నాడు. ప్రతిరోజు వర్షం కురుస్తుండడంతో ఎండిన ధాన్యం తడుస్తున్నది.
మూడు రోజులుగా కురిసిన వర్షాలకు తడిసిన వడ్లు మొలకెత్తాయి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని ఆరబెడుతున్నాడు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉండడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం సేకరణ చేస్తే నష్టం వాటిల్లదని, లేకపోతే తీరని నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. చాలా గ్రామాల్లో ధాన్యం ఆరబెట్టడానికి ఖాళీ స్థలాలు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఒకరి తరువాత మరొకరు ధాన్యాన్ని రోడ్లపైన ఆరబెడుతున్నారు.