నారాయణఖేడ్, జూన్ 8 : వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిందనే చెప్పాలి. దశాబ్దాల కలలను సాకారం చేసే దిశగా అనేక అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యరూపం ఇచ్చింది. తలాపునే మంజీరా నది పారుతున్నా సాగునీటికి నోచుకోని పరిస్థితుల్లో వర్షాధార పంటలను సాగుచేస్తూ అతివృష్టి, అనావృష్టి బారినపడి అనేక ఒడిదుడుకుల మధ్య వ్యవసాయం చేస్తున్నారు ఈ ప్రాంత రైతులు.
ఇక్కడి రైతుల కష్టాలకు చరమగీతం పాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించే బృహత్తరమైన బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నాంది పలికింది కేసీఆర్ ప్రభు త్వం. నీటి సమస్య మొదలుకొని ప్రజల అవసరాలను గుర్తించి దశల వారీగా చేపట్టిన అభివృద్ధి నియోజకవర్గ రూపురేఖలు మార్చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో గతించిపోయిన ప్రగతి శకం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర సమయంలో కాలచక్రం ముందుకు సాగింది తప్ప ప్రగతి చక్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎన్నికల్లో గట్టెక్కడమే లక్ష్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టిన ఉపన్యాసాలు ఉత్త ముచ్చట్లుగానే మిగిలిపోయాయి.అసెంబ్లీ ఎన్నికలకు ముం దు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకే మోక్షం లభించని నేపథ్యంలో ఇక ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసి చేపట్టే పనులు దేవుడెరుగు.
ఎన్నో ఆకాంక్షలతో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజల పరిస్థితి ఎడారిలో నీటిబొట్టు కోసం వెతికిన తీరుగా మారింది. ఇక సంక్షేమ పథకాల అమలు గురించి వేరే చెప్పనక్కర్లేదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇక్కడా నెలకొని ఉన్నది. బాండ్ పేపర్, హామీ పత్రాల పేరిట ప్రజలను నమ్మబలికిన కాం గ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడంతో కేవలం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నోటికొచ్చిన హామీలు వల్లే వేశారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
మంజూరైన పనులకు మోక్షమెప్పుడో
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభించక ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అత్యధిక పనులకు బీఆర్ఎస్ హయాంలోనే టెండర్ ప్రక్రియ పూర్తిచేశారు. అయినప్పటికీ పనులు కొనసాగడం లేదంటే పాలకులు ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఆయా పనులు చేయించే అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రయత్నాలేవి సాగకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిర్గాపూర్ మండలంలోని గైరాన్ తండాకు రోడ్డు, వంతెన నిర్మాణానికి రూ.2.90 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తయింది. కంగ్టి నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు డబుల్ లేన్ రోడ్డు కోసం రూ.17 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ పనులు ప్రా రంభం కాలేదు. కిషన్ నాయక తండా నుంచి పొట్పల్లి వరకు డబుల్ లేన్ రోడ్డు ఏర్పాటుకు రూ.4.37 కోట్లు మంజూరు చేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి దాదాపు 50 శాతం పనులు పూర్తి కాగా, అటు తర్వాత ఆ పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. రూ. కోటి నిధులతో నిర్మించాల్సిన నమ్లిమెట్ వంతెన పను లు మరుగున పడ్డాయి.
నారాయణఖేడ్ నుంచి సిర్గాపూర్ వరకు డబుల్ లేన్ రోడ్డు కోసం రూ.15 కోట్లు మంజూరై పనులు ప్రారంభించినప్పటికీ , ప్రస్తుతం పనులు కొనసాగకపోవడం గమనార్హం. నాగల్గిద్ద మండలంలో మోర్గి మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు, వంతెన నిర్మాణానికి రూ.6.32 కోట్లు మంజూరు కాగా, రోడ్డు పనులు పూర్తయినా వంతెన నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బ ందులు తప్పడం లేదు.
కంగ్టి నుంచి తడ్కల్ రోడ్డు గుండా కిలోమీటర్ మేర సీసీరోడ్డు పనులకు రూ.2.25 కోట్లు మంజూరై టెండర్ ప్రకియ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభం కావడంలేదు. ఇవే కాకుండా ఇంకా పలు తం డాలకు మంజూరైన రోడ్లు, వంతెనల పనులు ప్రారంభానికి నోచుకోకుండా మూలుగుతున్నాయి. ఎన్నికల సమయంలో తాము అధికారం చేపట్టిన వెంటనే ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచిపోతున్నా పనులు ముందుకు సాగకపోవడంతో ఓట్ల కోసం ఏ రోటికాడ ఆ పాట పాడినట్లు కాంగ్రెస్ నాయకుల వైఖరి తేటతెల్లమవుతున్నది.
ప్రజలకు ఒరిగిందేమిటి..?
ఓవైపు అభివృద్ధి..మరోవైపు సంక్షేమం పరుగులు పెట్టించిన కేసీఆర్ ప్రభుత్వంలో లేని లోపాలను చూపి మార్పు నినాదంతో ప్రజల మెదళ్లను చెడగొట్టి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమిటనే అనే ప్రశ్న తలెత్తుతున్నది. బీఆర్ఎస్ హయాంలో నిరంతరం ఏదో ఒక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దరికి చేరగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ, గ్రామాల్లో సీసీరోడ్ల పనులను ప్రారంభించడం వంటి కార్యక్రమాలు మినహా నియోజకవర్గానికి మేలు చేకూరే విధంగా చెప్పుకోదగ్గ పనులేవి ఏడాదిన్నర కాలంలో జరగలేదనే చెప్పాలి.
ఇంటిగ్రెటేడ్ స్కూల్ పేరిట సిర్గాపూర్ మండలం వాసర్ శివారులో శంకుస్థాపన చేసి హడావిడి చేసినా, అక్కడ ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం విశేషం. ఇక పంట రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వేరే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యలో ప్రజలు బీఆర్ఎస్ పాలనను గుర్తుచేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో నిరంతరం పథకాల కేటాయింపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభావం ప్రజల జీవన ప్రమాణాలపై చూపిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు స్తంభించడంతో ప్రజల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పదేండ్లు పురోగతిలో జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోటీ పడుతూ ముందుకు సాగిన నారాయణఖేడ్ వైభవం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మసకబారురుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
రైతుల సాగునీటి ఆశలు ఆవిరి
సాగునీటి వనరులు లేక గోసపడుతున్న నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.34 లక్షల ఎకరాలకు, కాళేశ్వరం 19ఏ ప్యాకేజీ ద్వారా మరో 35 వేల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది.
బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు సైతం యుద్ధప్రాతిపదికన ప్రారంభించినప్పటికీ అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో నియోజకవర్గానికి వరప్రదాయినిగా మారే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. మనూరు మండలం బోరంచ శివారులో ఎత్తిపోతల పథకానికి సంబంధించి భారీ పంపుహౌస్ నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు కాస్త నిలిచిపోయాయి. ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించినప్పటికీ పనుల్లో వేగం లేదు. నత్తతో పోటీ పడుతున్నట్టుగా పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు కాళేశ్వరం 19ఏ ప్యాకేజీ ద్వారా పెద్దశంకరంపేట మండలానికి సాగునీరందించే అవకాశం ఉండగా, ఆ ప్రణాళికను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కాని, స్థానిక ఎమ్మెల్యే కాని ఎక్కడా దీని గురించి ప్రస్తావించకపోవడమే ఇందుకు నిదర్శనం. సింగూరు నీటిని నల్లవాగు ప్రాజెక్టుకు తరలించే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.100 కోట్లతో ప్రతిపాదించిన కారాముంగి ఎత్తిపోతల పథకానికి మంజూరు దశలో ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ ప్రతిపాదనపైనా ప్రస్తుత ప్రభుత్వం పెద్దగా దృష్టిసారించిన దాఖలా లు లేవు.
నియోజకవర్గంలో కొత్తగా ఎనిమిది కొత్త చెరువులు మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, భూసేకరణ వరకు ప్రక్రియను ముందుకు కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం వీటి గురించి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నది. నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ విషయంలో ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన కాంగ్రెస్ నా యకులు, ఇప్పుడు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. నియోజకవర్గంలో సాగునీటి వనరులు సృష్టించి అత్యధిక శాతం భూములకు సాగునీరందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ల క్ష్యం తో నీరుగారుతున్నది. సాగునీటిపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి.
హామీల పేరుతో కాంగ్రెస్ మోసం..
ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు అలవికాని హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు స్థానిక సమస్యలపైనా అడిగిందల్లా నెరవేరుస్తామని నమ్మబలికారు. అమాయకులైన ప్రజలు నమ్మి ఓటేస్తే ఏడాదిన్నర కాలంలో ఒక్క సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం ద్వారా బీఆర్ఎస్ హయాంలో నిరాటంకంగా నీటిని సరఫరా చేశాం.
ఇప్పుడు నీటిని సక్రమంగా సరఫరా చేయలేని చేతగాని పాలన ఇది. ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఓవైపు సీఎం బహిరంగంగా ప్రకటిస్తూ మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పేరిట ప్రజలను మభ్య పెడుతూ మరో మోసానికి తెరలేపారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను కొనసాగించడంలో ప్రభుత్వం గాని స్థానిక ఎమ్మెల్యే గాని అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుక్కుంటున్నారు. హామీలు అమలు చేయకుండా మాట తప్పిన కాంగ్రెస్ ప్రజా క్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదు.
-మహారెడ్డి భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే