చిలిపిచెడ్, జూన్ 13: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చండూర్ పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం హరిసింగ్ అన్నారు. శుక్రవారం చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి యూనిఫాం (School Uniform) అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు యూనిఫాంలు అందిస్తున్నామన్నారు.
వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు గురువారం పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రతీచోట తొలి రోజు హడావిడి కనిపించింది. అన్నిచోట్ల తొలిరోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించారు. మొత్తంగా 50 లక్షల పాఠ్యపుస్తకాలు, 20 లక్షల యూనిఫాం అంద జేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో పుస్తకాల పంపిణీ ఆలస్యమవ్వడం, మరికొన్ని చోట్ల అందరికీ యూనిఫాం అందుబాటులో లేకపోవడంతో పంపిణీ జరగలేదు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,852 ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల పాఠశా లలకు 1,01,66,220 పుస్తకాలు చేరాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలిరోజు పాఠశాలలకు 8,33,398 లక్షల మంది హాజరయ్యారని, వీరిలో 54,52,708 మందికి పుస్తకాలు అందించామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 20,30,667 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి రోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు ఒక జత యూనిఫాంలను అందజేయగా, రెండో జత త్వరలో అందిస్తామని వెల్లడించారు.