పటాన్చెరు రూరల్, సెప్టెంబర్ 30: ఏడాది పనిచేసిన కార్మికులకు పరిశ్రమలు ప్రకటించే బోనస్ కొత్తకాంతులు నింపుతాయి. ఈ ఏడాది అధికశాతం పరిశ్రమలు బోనస్ ప్రకటించడం లేదు. దీంతో కార్మిక కుటుంబాల్లో దసరా వాతావరణం కనిపించడం లేదు. అప్పు చేస్తేకాని విజయదశమి చేసేలా లేదు. 1965 బోనస్ చట్టం ప్రకారం ప్రతి పరిశ్రమ ఏడాదికి ఒకసారి పరిశ్రమ లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా వేతనంపై 8.33 శాతం నుంచి 20శాతం వరకు బోనస్ కార్మికులకు అందజేయాలి. 20శాతానికి మించి ఇచ్చినా కార్మిక చట్టం స్వాగతిస్తుంది.
ప్రతి పరిశ్రమలో ఐదేండ్లు పూర్తి చేసుకున్న కార్మికులకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమల్లో పనిచేసే పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులకు కూడా బోనస్ ఇవ్వాలని చట్టం చెబుతున్నది. లాభనష్టాలతో సంబంధం లేకుండానే బోనస్ చెల్లించాలి. పరిశ్రమల్లో విజయదశమికి బోనస్ ప్రకటించడం ఆనవాయితీ. అది కానప్పుడు దీపావళికి బోనస్ చెల్లిస్తారు. ఈ సారి బహుళజాతి కంపెనీలు మాత్రమే దసరాకు బోనస్ ప్రకటిస్తున్నాయి.
అక్కడక్కడ కొన్ని పరిశ్రమలు మాత్రమే కార్మికులకు బోనస్ ఇస్తున్నాయి. దాంట్లోనూ పర్మినెంట్ ఉద్యోగులకు ఒకరకంగా, కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులకు మరో విధంగా బోనస్ ఇస్తున్నారు. దాదాపు సగంమంది కార్మికులకు బోనస్ రావడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో లక్షా50వేల మంది కార్మిక కుటుంబాలు ఉన్నాయి. కాంట్రాక్టు, పర్మినెంట్, రోజువారి కార్మికులు అన్సలరీల్లో పనిచేస్తున్నారు. వాటిలో ఇప్పుడు యాభైశాతం కుటుంబాలు విజయదశమికి బోనస్ రాక పరేషాన్లో ఉన్నాయి.
పాశమైలారం పారిశ్రామికవాడలో దాదాపు 350 పరిశ్రమలు ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. ఈ ఏడాది వాటిలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలోనే బోనస్ అందజేస్తున్నాయి. అం దులో బహుళజాతి పరిశ్రమలు ముం దుగానే దసరాకు అందజేశాయి. ఫార్మా పరిశ్రమలు కొన్ని బోనస్ ఇస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికులు ఏడాది పనిచేసినా బోనస్ ఇవ్వట్లేదు. ఫార్మా కంపెనీలు ప్రతి నెలా జీతం డబ్బులతో పాటు పూర్తి స్థాయి అటెండెన్స్ ఉన్నట్లుగా రుజువు ఉంటేనే బోనస్ రూపంలో కొద్దిపాటి అదనపు డబ్బులు ఇస్తున్నాయి. ఏడాదికి ఒకసారి ఇచ్చే బోనస్‌కు అటెండెన్స్‌కు సంబంధం ఉండదు. ఈ విధానంపై కార్మికశాఖ నజర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫార్మా పరిశ్రమల్లో దారుణంగా 12 గంటల పనివిధానం అమలవుతున్నది. బోనస్ చట్టం స్పష్టంగా ప్రతి ఏడాది 8.33శాతం చెల్లించాలని చెప్పినా పట్టించుకునే నాథుడు లేడు. ఈ ఏడాది పరిశ్రమల ఉత్పత్తి సైతం మందగించిందని యాజమాన్యాలు పేర్కొంటూ తప్పించుకుంటున్నాయి. అధికశాతం కార్మిక కుటుంబాలు దసరా షాపింగ్ చేయలేదు. బోనస్ లేకపోవడంతో కార్మికులు అప్పుచేసి పండుగ జరుపుకోవాలని చూస్తున్నారు.
యాజమాన్యాలు దీపావళి లేదంటే నవంబర్ 30 వరకు బోనస్ చెల్లించాలి. నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులకు బోనస్ చట్టం కచ్చితంగా అమలు చేయాలి. కనీసం 8.33శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఆపైన చెల్లించినా సరే. ఏడాదికి ఒకసారి చెల్లించే బోనస్‌కు అటెండెన్స్‌కు సంబంధం ఉండదు. నవంబర్ 30 తర్వాత బోనస్ చెల్లించని యాజమాన్యాలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తాం.
-రవీందర్‌రెడ్డి, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్, సంగారెడ్డి జిల్లా