గజ్వేల్, డిసెంబర్ 8: సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ బైపాస్‌లో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. గజ్వేల్ సీఐ సైదా వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం గాడిచెర్లపల్లికి చెందిన పూసల వెంకటేశ్(38) దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నకొడూర్ మండలం పెద్దకోడూరుకు చెందిన వర్దోలు పరంధాములు(46)రాయపోల్ పోలీస్‌స్టేషన్‌లో విధు లు నిర్వహిస్తున్నారు.
శనివారం రాత్రి వెంకటేశ్ దౌల్తాబాద్‌లో, పరంధాములు రాయపోల్‌లో విధులు నిర్వర్తించారు. అనంతరం ఇద్దరు కలిసి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో నిర్వహించే హాఫ్ మారథాన్‌లో పాల్గొనేందుకు ఏపీ 15బీఎన్ 9215 బైక్‌పై ఆదివారం వేకువజామున బయలుదేరారు. గజ్వేల్ సమీపంలోని జాలిగామ బైపాస్‌రోడ్డులో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ సైదా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను గజ్వేల్ మార్చురీకి తరలించారు.
సిద్దిపేట సీపీ అనురాధ, అడిషినల్ డీసీపీ మల్లారెడ్డి, గజ్వేల్ ఇన్చార్జి ఏసీపీ మధు, ఇన్స్పెక్టర్ సైదా, దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పూజల వెంకటేశ్ 2007లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జిల్లాలోని సిద్దిపేట, మిరుదొడ్డి, సిద్దిపేట ట్రాఫిక్, పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించాడు. ప్రస్తుతం దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ మృతిచెందాడు.
ఇతనికి భార్య ఉషాల శ్యామల, ఇద్దరు కూతుళ్లు వెన్నెల, హన్సిక ఉన్నారు. వర్దొలు పరంధాములు 2004లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. మొదట కొల్చారంలో విధులు నిర్వహించాడు. అనంతరం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఠాణాలో, సిద్దిపేట కమిషనరేట్‌లోని సీసీ కెమెరా విభాగం, ప్రస్తుతం రాయపోల్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య కళ్యాణి, కూతురు నక్షత్ర, కుమారుడు మణితేజ ఉన్నారు. ఈ ఏడాది జూలై 4న రాయపోల్‌కు బదిలీపై వచ్చాడు.
పోలీస్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కష్టపడి ఉద్యోగం సాధించిన పూజల వెంకటేశ్, వర్దోలు పరంధాములు చిన్న వయస్సులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం విడదీయలేని బంధంగా మారింది. సిద్దిపేటలో 2022లో పోలీస్ శాఖ నిర్వహించిన హాఫ్ మారథాన్ ఇద్దరిలో మంచి స్ఫూర్తిని నింపింది.
సిద్దిపేట మారథాన్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వీరు యువతలో ప్రేరణ నింపాలనే ఉద్దేశంతో దేశంలోని హైదరాబాద్, ముంబయిలో నిర్వహించిన 42 మారథాన్, ఢిల్లీలో 25 మారథాన్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన 15కు పైగా హాఫ్ మారథాన్లలో పాల్గొన్నారు. సిద్దిపేటలో ఎంతో మంది పోలీస్ కానిస్టేబుళ్లు, యువతకు స్ఫూర్తిగా నిలిచారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించిన మారథాన్లకు ఇద్దరు కలిసి వెళ్లేవారు. మారథాన్‌లో అనేక సందర్భాల్లో పాల్గొన్న వీరిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేశ్, పరంధాములు మృతిచెందడంపై మాజీ మంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ ఉద్యోగంలో నిబద్ధ్దత కలిగిన ఈ ఇద్దరు యువ కానిస్టేబుళ్లు మృతి చెందడం బాధాకరమని, పోలీస్ ఉద్యోగులుగా కాకుండా సామాజిక సేవకులుగా వీరు పనిచేసి ఎంతో స్ఫూర్తి నింపారని కొనియాడారు. సిద్దిపేటలో జరిగిన హాఫ్ మారథాన్‌లో పాల్గొని యువతలో చైతన్యం తెచ్చారని, ఉచిత కానిస్టేబుల్ కోచింగ్, ఇతర సామాజిక సేవల్లో వారు అందించిన సేవలను కొనియాడారు.
వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వెంకటేశ్, పరంధాములు మృతి చాలా బాధాకరమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి.అనురాధ పేర్కొన్నారు. గజ్వేల్ దవాఖానలోని మార్చురీలో మృతదేహాలకు ఆమె సంతాపం తెలిపారు. పోలీస్ శాఖ తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామని, వారికి రావాల్సిన అన్ని బెన్ఫిట్స్ త్వరగా కుటుంబాలకు అందేలా చూస్తామన్నారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, గజ్వేల్ ఇన్చార్జి ఏసీపీ మధు, పోలీస్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పుష్పగుచ్ఛం వేసి నివాళులర్పించారు. ఇన్స్పెక్టర్లు సైదా, మహేందర్, విద్యాసాగర్, ఎస్సైలు, మృతుల బ్యాచ్‌మేట్స్, ప్రజాప్రతినిధులు మృతదేహంపై పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు.