తూప్రాన్, నవంబర్ 13: నిషేధిత గంజాయిని నిల్వ ఉంచి, విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన బుధవారం విలేకరులతో వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి నిషేధిత ఎండు గంజాయిని విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మనోహరాబాద్ ఎస్ఐ సుభాశ్‌గౌడ్ సిబ్బందితో తనిఖీ చేశారు.
నిందితుడు రంజన్‌కుమార్ తన చేతిలో ఉన్న గంజాయిని పొదల్లో పారవేసి పారపోయేందుకు ప్రయత్నించగా అతడిని పట్టుకుని విచారించారు. దీంతో నిందితుడు రంజన్‌కుమార్ ముప్పిరెడ్డిపల్లిలో ఉంటున్న స్నేహితుడు శ్రీధర్సాహు వద్దకు తీసుకెళ్లాడు. అతడిని విచారించగా రూమ్‌లో దాచిన 9 కిలోల 300 గ్రాముల ఎండు గంజాయిని చూపించాడు. మొత్తం గంజాయిని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి కేసును ఛేదించిన సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాశ్‌గౌడ్, కానిస్టేబుళ్లు ప్రసాద్, అనిల్, శ్రీనివాస్ గౌడ్, భిక్షపతిలను ఎస్పీ అందించారు.
పటాన్చెరు, నవంబర్ 13: పటాన్చెరు పట్టణంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 6.03 కేజీల గంజాయి పట్టుకున్నారు. బుధవారం పటాన్చెరు ఎక్సైజ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పటాన్చెరు పట్టణంలోని వాల్యూజోన్ షోరూం ఎదుట, ఘనపూర్ చౌరస్తాలో ఎక్సైజ్ శాఖ అధికారులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపట్టారు. రెండు చోట్ల ఆరు కేజీల ముప్పై గ్రాముల గంజాయిని ముగ్గురు వ్యక్తుల వద్ద పట్టుకున్నారు. ఒడిశా రాష్ర్టానికి చెందిన మద్కమి లచ్చ (27), ఎర్మి సునామ్ (33), పునిమ్ (33)ల వద్ద గంజాయి లభ్యమైంది. మరో కేసులో బీహార్ వాసి తౌకిర్ హబీబ్(28) వద్ద గంజాయి లభ్యమైంది. వీరందరినీ సంగారెడ్డి కోర్టుకు తరలించారు.