సిద్దిపేట, మార్చి 24( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వందశాతం పంట రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనిపై చాలామంది రైతులు మండిపడుతున్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం మాత్రం వందశాతం రుణమాఫీ చేశామని చెబుతున్నది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షన్నరకు పైగా రైతు కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.
రెండు లక్షల రూపాయల లోపల ఉన్న రైతులు లక్షన్నరకు పైగానే ఉన్నారు. ప్రభుత్వ తీరుపై సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని రైతులు, రైతు సంఘాల నాయకులు పోరు బాటకు సిద్ధ్దమవతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో 3లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశామని చెబుతున్నది. కానీ, ఇంకో లక్షన్నర రైతు కుటుంబాలకు మాఫీ చేయాల్సి ఉన్నది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా ఇంకా 50శాతం పైగా రైతులకు రుణమాఫీ కాలేదు.వీరి రుణమాఫీ చేయకుండానే వందశాతం చేశామని ప్రభుత్వం చెబుతుండడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. రెండు లక్షల పైన రుణం ఉన్న రైతులు మిత్తికి డబ్బులు తెచ్చి పైన డబ్బులు బ్యాంకుల్లో కట్టారు.
తీరా ప్రభుత్వం వారికి రుణమాఫీ వర్తింపజేయక పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చేయాలనుకున్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతుల లోన్ అకౌంట్లో జమచేసి మిగతా డబ్బులు కట్టుంటే బాగుండేది. కానీ, ప్రభుత్వం అలా చేయలేదు. రెండు లక్షల రూపాయలపైన ఉన్న రుణం డబ్బులు కడితేనే రుణమాఫీ అవుతుందేమోనని చాలామంది రైతులు వడ్డీలకు తెచ్చి మిగతా డబ్బులను బ్యాంకుల్లో కట్టారు. వీరి అప్పలు తడిసి మోపెడయ్యాయి. ఎంతో మంది రైతులు జిల్లాలో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. తీరా ప్రభుత్వ ప్రకటనతో రైతులంతా నిరాశలో మునిగిపోయారు.
ప్రభుత్వ అధికారిక యంత్రాంగం చెబుతున్న ప్రకారం సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో 53,129 మందికి రూ.290.21 కోట్లు, రెండో విడతలో 27,955 మందికి రూ.279.33 కోట్లు, మూడోవిడతలో 21,239 మందికి రూ.273.51 కోట్లు, నాలు గో విడతలో 9.0 63 మందికి రూ.95.255 కోట్లు , మొత్తం 1,11,386 మంది రైతులకు రూ. 938.305 కోట్లు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.
మెదక్ జిల్లాలో రెండు లక్షల రుణాల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకా రం మొదటి విడతలో 48,251 మంది రైతులకు రూ.240.78 కోట్లు, రెండో విడతలో 21,618 మంది రైతులకు రూ.204.40 కో ట్లు, మూడో విడతలో 159.03కోట్లు, నాలు గో విడతలో 6,389 మందికి రూ. 50 కోట్లు, మొత్తంగా జిల్లాలో 88,683 మందికి రూ. 654.21 కోట్ల రుణాలు మాఫీ చేసింది.
సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 50,538 మంది రైతులకు రూ. 277.73 కోట్లు, రెండో విడతలో 27,233 మంది రైతులకు రూ. 286.93 కోట్లు, మూడో విడతలో 19,795 మంది రైతులకు రూ. 277.74 కోట్లు, నాలు గో విడతలో 11,301 మంది రైతులకు రూ. 110. 39 కోట్లు మాఫీ చేశారు. మొత్తం జిల్లా లో 1,08,867 మంది రైతులకు రూ. 952.79 కోట్లు మాఫీ చేశారు.
కొమురవెల్లి, మార్చి 24: మా ఇంట్లో ముగ్గురు పంట రుణం తీసుకున్నం. కాంగ్రె స్ ఎన్నికలప్పుడు ఇంట్లో ఎంతమంది పంట రుణం తీసుకున్నా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రుణం మాఫీ అయితదానుకున్నం. తర్వాత రూ.2లక్షలపైన ఒక్క రూ పాయి ఉన్నా మాఫీ రాదనడంతో రూ.60 వేలు కట్టినం. ముగ్గురికి కలిసి ఇంకో రూ.1.80 లక్షలు అసలు ఉండే. మా ఇంట్లో ముగ్గురిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. మా ఊరిలో 30 మందికి రుణమాఫీ కాలేదు.
– బ్రహ్మండ్లపల్లి కనకయ్య, రైతు, గురువన్నపేట
యూనియన్ బ్యాంకు లో రూ.2,64,766 పంట లోన్ ఉంది. రే వంత్ ప్రభుత్వం వ చ్చాక రెండు లక్షల్లోపు రుణమాఫీ చేస్తానని అంటే రూ.65,000 వేలు అప్పు చేసి బ్యాం కులో కట్టా. ఇంతవరకు రుణమాఫీ కాలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు రూ.80 వేల రుణమాఫీ అయింది. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం వచ్చాక ఇప్పుడు మాకు లోన్ మాఫీ చెయ్యక అన్యాయం చేసింది.
-దామెరపల్లి శ్రీను, రైతు, గుర్రాలగుంది, నారాయణరావుపేట
గజ్వేల్, మార్చి 24: ప్రజ్ఞాపూ ర్ మంజీరా గ్రామీణ బ్యాంకు లో రూ.1.90 లక్షల పంటరు ణం తీసుకున్న. అసలుకు మి త్తికి కలిపితే రెండు లక్షల పైబడిన డబ్బులుంటే రెన్యువల్ చేశా. అయినా నాకు రుణమాఫీ కాలేదు. అదే బ్యాం కులో నా భార్య బాలమణి పేరు మీద రూ.20 వేలు రుణం తీసుకున్నా. మా ఇద్దరిలో ఎవరికీ కాలేదు. మా ఊరిలో రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం చెప్పిందొకటి చేసిందొకటి.
– గుండబోయిన మల్లేశం, రైతు, అక్కారం, గజ్వేల్ మండలం
దుబ్బాక,మార్చి 24: మాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు దుబ్బాక బ్రాంచ్‌లో నా పేరిట రూ.40 వేలు, నా భార్య పేరిట మరో రూ.30 వేల పంట రుణం ఉంది. రుణమాఫీ జాబితాలో మా పేర్లు రాలేదు. బ్యాంకుకు వెళ్లి సార్లను అడిగితే రుణమాఫీ వర్తించలేదని చెబుతున్నారు. నా పేరిట తీసుకున్న అప్పు రూ.40 వేలకు వడ్డీతో కలిపి రూ.50 వేలు అయ్యిందని బ్యాంకు సార్లు చెబుతున్నారు. నా భార్య పేరిట మరో రూ.40 వేలు వరకు ఉందన్నారు. మా ఇద్దరికి కలిసి లక్ష రూపాయల్లోపే పంట రుణం ఉంది. అయినా ఒక్కరికి కూడా రుణం మాఫీ కాలేదు. అప్పు పెరిగిపోవట్టే. భూముల ధరలు తగ్గవట్టె. వేసిన పంట ఎండిపోవట్టే. మేము ఏమి చేయాలి ఇక. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిండా ముంచింది.
– ఎంగారి గోపాల్‌రెడ్డి, రైతు, దుబ్బాక
దుబ్బాక,మార్చి 24: నాకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట సాగుకు అప్పట్లో రూ.2 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకున్న. బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ కోసం తెలుసుకుంటే మాఫీ కాలేదని చెబుతున్నారు. బ్యాంకులో తీసుకున్న రూ.2 లక్షల అప్పుకు వడ్డీతో కలిపి రూ.4 లక్షల వరకు పెరిగింది. కాంగ్రెస్ సర్కారు రైతులకు రుణమాఫీ చేసిందని చెబుతుంది. నాకు మా త్రం బ్యాంకులో రుణం మాఫీ కాలేదు. మా దుబ్బాకలో చాలామంది రైతులకు రుణం మాఫీ కాలేదు. ఎవరిని అడిగినా సరైనా సమాధానం చెప్పడం లేదు. కాంగ్రెస్ సర్కారు రైతుల జీవితాలతో చెలగాటమడుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాకు పంట రుణ మాఫీ చేయకుండా అన్యాయం చేసింది.
– ఎంగారి రాజిరెడ్డి, రైతు, దుబ్బాక