జిన్నారం, జూలై 5: సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలోని హార్టెక్స్ రబ్బర్ పరిశ్రమ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై టీఆర్టీయూసీ విజయం సాధించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ట్టీయూసీకి చెందిన రాష్ట్ర కార్మిక నాయకుడు వరప్రసాద్‌రెడ్డి తన ప్రత్యర్థి ఐఎన్టీయూసీ అభ్యర్థి నరసింహారెడ్డి పై 119 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వరప్రసాద్ రెడ్డికి 331 ఓట్లు పోలవగా, నరసింహారెడ్డికి 218, బీఎంఎస్‌కు 60 ఓట్లు వచ్చాయి. టీఆర్ట్టీయూసీ విజయంతో కార్మికులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబురాలు చేసుకున్నారు.
అనంతరం కార్మిక నాయకుడు వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ… కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న టీఆర్టీయూసీ వెంట నిలిచిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక శ్రేయస్సుకు నిరంతరం యూనియన్ పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ముమ్మాటికి ఇది కార్మికుల విజయం అన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన వరప్రసాద్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అభినందించారు. అనంతరం యూనియన్ నాయకులు, కార్మికులు వరప్రసాద్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పరిశ్రమ యూనియన్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, నాయకులు దీనానాద్, శ్రీమన్నారాయణ, రాజారాం, కార్మిక నాయకులు లకన్ సింగ్, ఉద్యానంద్, ధర్మేందర్ యాదవ్, ఉమా కాంతి యాదవ్, తివారీ, కార్మికులు పాల్గొన్నారు.