కోహీర్, మే 10: దేశ రక్షణలో ఆ తండాబిడ్డలు ముందున్నారు. దేశ సరిహద్దులో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సేడియగుట్ట తండాకు చెందిన బానోత్ నర్సింగ్ సైనికుడిగా సేవలందిస్తున్నారు. గమనిబాయి దేవాలనాయక్ మూడో కుమారుడు బానోత్ నర్సింగ్ సీఆర్పీఎఫ్ సీఐగా రానాక్లో విధులు నిర్వహిస్తున్నారు. అతడి రెండో సోదరుడు బానోత్ దశరథ్ 32 ఏండ్ల పాటు దేశ రక్షణకు పాటుపడ్డారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు.
హైదరాబాద్లోని డీఆర్డీఏ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తండాకు చెందిన మరో గిరిజనుడు బానోత్ సురేశ్ కూడా ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. అన్న దశరథ్ రిటైర్డ్ అయినప్పటికీ తమ్ముడు నర్సింగ్ మాత్రం జమ్ములో పనిచేస్తున్నారు. కాగా సేడియ గుట్ట తండాకు చెందిన మరో ఇద్దరు కూడా సైనికులుగా దేశ రక్షణలో భాగస్వాములయ్యారు. బానోత్ హీరాలాల్, చవాన్ సుభాశ్ దేశ సేవకు అంకితమయ్యారు. తమ తండా నుంచి దేశానికి సేవలందిస్తుండడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూరు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.