కొండాపూర్, డిసెంబర్ 13 : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువు శుక్రవారం సందడిగా మారింది. కంది ఓడీఎఫ్ తయారు చేసిన రెండు యుద్ధ ట్యాంకులను శుక్రవారం మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్న్ చేయగా, విజయవంతం అయ్యా యి. ఓడీఎఫ్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో కార్మికులు, ప్రత్యేక పోలీసు బలగాలు మల్కాపూర్ చెరువు వద్దకు తరలివచ్చి యుద్ధట్యాంకుల ట్రయల్న్న్రు వీక్షించారు. ఈ సందర్భంగా కంది ఓడీఎఫ్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ రక్షణ అవసరాలకు కావాల్సిన యుద్ధ ట్యాంకులను ఆధునిక టెక్నాలజీతో తయారుచేస్తున్నామని, సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశానికి తలమానికం అని పేర్కొన్నారు.
యుద్ధక్షేత్రంలో సైనికులు ఎత్తు పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో శత్రుసేనలను దీటుగా ఎదుర్కొనేలా ట్యాంక్లు తయారు చేశామన్నారు. దేశ రక్షణకు కావాల్సిన యుద్ధట్యాంకులను స్వదేశీ టెక్నాలజీతో కంది ఓడీఎఫ్లో తయూరుచేస్తున్నట్లు తెలిపారు. బీఎంపీ కన్వర్షన్ వెహికల్, బీఎంపీ ఓవరాయిలింగ్ వెహికల్ యుద్ధ ట్యాంకులను తయారు చేశామన్నారు. ఈ యుద్ధ ట్యాంకులు 14 టన్నుల బరువు ఉన్నప్పటికి నీళ్లలో తేలుతూ పడవలా ప్రయాణం చేయడం దీని ప్రత్యేకత అన్నారు. నీళ్లలో గంటకు 7 నుంచి 8 కి.మీ స్పీడ్తో పరుగులు తీస్తుందన్నారు.
నేలపై గంటకు 60 కి.మీ స్పీడ్తో వెళ్తుందన్నారు. యుద్ధ్ద సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి ఈ యుద్ధ ట్యాంకులు ఉపయోగపడతామని ఆయన తెలిపారు. ఆర్మీకి ఇప్పటి వరకు 2 వేలకు పైగా యుద్ధట్యాంకులను కంది ఓడీఎఫ్ నుంచి పంపించినట్లు చెప్పారు. ఓడీఎఫ్లో తయారుచేసిన యుద్ధ ట్యాంకులను 20 సార్లు వివిధ రకాల టెస్టులు చేసిన తర్వాత ఆర్మీకి అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేసేజర్, ఓడీఎఫ్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.