పటాన్చెరు, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ప్రయాణికుల భద్రత గురించి మరోసారి ఆలోచింపజేసింది. దీంతో అప్రమత్తమైన సంగారెడ్డి జిల్లా రవాణాశాఖ అధికారులు శనివారం ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల తీరులో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. పటాన్చెరులో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ టావెల్స్ బస్సులను తనిఖీ చేసి, బస్సుకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.
ట్రావెల్స్ బస్సులను ఈశాన్య రాష్ర్టాల్లో రిజిస్ట్రేషన్ చేయించి, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ర్టాలకు నడిపిస్తున్నట్లు గుర్తించారు. ట్రావెల్స్ యాజమాన్యాలు ఈశాన్య రాష్ర్టాలో బస్సులకు రిజిస్ట్రేషన్ చేయించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, నేషనల్ పర్మిట్లు తీసుకొని ఇక్కడ నడిపిస్తున్నట్లు తెలిసింది. కావేరి ట్రావెల్స్ బస్సు పార్కింగ్ పాయింట్‌ను పటాన్చెరులో 65వ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. నిత్యం ఇక్కడ వారి బస్సులను సర్వీసింగ్ చేసి పంపిస్తారు. ట్రావెల్స్ బస్సులకు బయట పెట్రోల్ పంపుల్లో డీజిల్ పోయించుకోరు.
మినీ ట్యాంకర్లో డీజిల్ తెచ్చి బస్సుల్లో పోస్తారు. ప్రతిరోజు పటాన్చెరు, రామచంద్రాపురం, బీరంగూడ కమాన్, అశోక్‌నగర్, బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి ట్రావెల్స్ బస్సులు దేశంలోని పలు రాష్ర్టాలకు రాకపోకలు సాగిస్తాయి. ప్రమాదాలకు గురైన బస్సులన్నీ స్లీపర్ క్లాస్ ట్రావెల్స్ బస్సులే ఉంటున్నాయి. వైరింగ్, షార్ట్‌సర్క్యూట్‌తో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగిన సమయంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులపై రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత, అవినీతి కారణంగా నిబంధనలు అమలు కాక ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు బస్సుల రికార్డులు పరిశీలించి చేతులు దులుపుకొంటున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో చర్యలు తీసుకోవడం లేదనే అపవాదు ఉంది. బస్సులకు రిజిస్ట్రేషన్ ఇతర రాష్ర్టాల్లో చేసుకొని ఇక్కడ నడిపిస్తున్నారు.
అనధికారికంగా స్లీపర్లు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారుల విచారణలో అనేకసార్లు బయటపడింది. గతంలో ఏ రాష్ట్రంలోని వాహనాలు అదే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. కేంద్ర ప్రభుత్వం ఆలిండియా పర్మిట్ వాహనాలకు ఇవ్వడంతో ఏ రాష్ట్రంలోనైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు ఇతర రాష్ర్టాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని బస్సులు నడిపిస్తున్నారు. తెలంగాణలో పన్నులు ఎక్కువగా ఉండడంతో ఈశాన్య రాష్ర్టాల్లో బస్సులు రిజిస్ట్రేషన్ చేసి నడిపిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, డామన్ డయ్యూలో తక్కువ పన్నులు ఉండడంతో, ఆ రాష్ట్రం నుంచి పర్మిట్లు తీసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో నడిపిస్తున్నారు.
పార్కింగ్ చేసిన చోట డ్రైవర్లు వంట చేసుకుని, కొందరు మద్యం తాగడం చేస్తున్నారని, మత్తు దిగకుండానే రాత్రి తిరిగి ప్రయాణం చేస్తున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్ బస్సులను తూతూమంత్రంగా తనిఖీ చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సులో వస్తువులు రవాణా చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు.ప్రయాణికుల లగేజ్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్నారు. ఫైర్ అలారం, అగ్నిమాపక సిలిండర్లు ఉండడం లేదు. సీట్ల ఆల్టేషన్ సరిగా చేయక ప్రమాదాలు జరిగిన సమయంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతున్నది.