మెదక్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాగా పురుడుపోసుకున్న మెదక్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా వృద్ధితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మెదక్ జిల్లా కేంద్రం నలుదిశలా వ్యాపించింది. మెదక్, నర్సాపూర్, తూప్రాన్ పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి.
జనాభా పెరగడంతో పాటు క్రైం రేట్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలో జనాభా వేగంగా పెరుగుతోంది. ప్రధానంగా జిల్లా కేంద్రం మెదక్‌లో వలసలు గణనీయంగా పెరిగాయి. మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, బీహారు రాష్ర్టాలకు చెందిన వారితో పాటు నేపాల్ దేశస్తులు మెదక్ జిల్లాకు ఎక్కువగా వస్తున్నారు. జిల్లాలోని చిన్నశంకరంపేట, మనోహరాబాద్, తూప్రాన్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఉండడంతో ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు.
జిల్లాకేంద్రం మెదక్‌లో 75వేల జనాభా ఉండగా, ఒకే పట్టణ పోలీస్ స్టేషన్ ఉంది. జనాభా పెరుగుతున్నా అదనపు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లేదు. మెదక్ మండలం అవుసులపల్లి, ఔరంగాబాద్ గ్రామాలను మెదక్ మున్సిపాలిటీలో కలిసినా అవి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉంటున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న నేరాలను, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి సరిపోవడం లేదు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటున్నది. మెదక్‌లోని రాందాస్ చౌరస్తా, జేఎన్ రోడ్, న్యూ బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటోంది. మెదక్‌లోని రాందాస్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, మెదక్-బోధన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిగ్నల్స్ నిర్వహణ సరిగా జరగడం లేదు. దీంతో వాహనదారులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సిగ్నల్స్ దాటుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యల
ఏర్పడుతున్నది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్ జిల్లాలో 21 పోలీస్ స్టేషన్లతో పాటు ఒక సీసీఎస్ ఉంది. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, సైబర్ క్రైం ఇలా నేరాలు ఎక్కువగా జరగడంతో ఉన్న పోలీస్ స్టేషన్లపైనే నేరాల భారం పడుతోంది. దీంతో పోలీసులు నేరాలను సవాళ్లుగా తీసుకోవాల్సి వస్తోంది. జిల్లాలో అదనపు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు మెదక్ ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్, మాసాయిపేట పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.
మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోంది. మహిళలపై జరుగుతున్న హత్యలు, చైన్‌స్నాచింగ్, మిస్సింగ్ కేసులు జిల్లాలో బాగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా చర్యలు చేపట్టలేదు. జిల్లాలో పెరుగుతున్న జనాభా, నేరాలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని అదనపు పోలీస్ స్టేషన్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.
మెదక్ జిల్లాలో ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఒక సీసీఎస్ కోసం సైతం ప్రతిపాదనలు పంపాం. కచ్చితంగా జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే నిర్ణయంలో భాగంగా జిల్లాకు అదనపు పోలీస్ స్టేషన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారు.
– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ మెదక్