పటాన్చెరు, నవంబర్ 2 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 65వ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రజలకు విసుగు వస్తున్నది. ఈ రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ప్రతిరోజు ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ -3 నుంచి పటాన్చెరు వైపు, ఇస్నాపూర్ వైపు భారీ వాహనాలు రోడ్డుకు ఇరువైపులా ఇష్టారాజ్యంగా నిలుపుతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులే కాకుండా తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై లారీలు, ట్రావెల్స్ బస్సులు, డీసీఎంలు అడ్డదిడ్డంగా నిలిపివేస్తున్నారు.
రోడ్డుకు ఇరువైపులా వాహనాలకు అడ్డాగా మారింది. సర్వీస్ రోడ్డులో సైతం వాహనాలు నిలుపుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్డగోలుగా నిలుపుతున్న లారీలు, డీసీఎంలు, చిన్న ట్రక్కులతో రోడ్డు ప్రమాదాలకు జరుగుతున్నాయి. రింగ్‌రోడ్డు నుంచి దిగిన వాహనాలు సైతం రోడ్డు పై నిలిపివేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఉండడంతో ఆఫీసు ముందు వాహనాలు నిలిపివేస్తున్నారు. కొన్నిసార్లు భారీ వాహనాలు రోడ్డుపై నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఈ మార్గంలో వెళ్లే సమయంలోనే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడం, వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలుపకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం సమయాల్లో సమస్య తీవ్రంగా ఉంటున్నది.
ముత్తంగి ఓఆర్ఆర్కు ఇరువైపులా పటాన్చెరు, ఇస్నాపూర్ వైపు భారీ వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిపివేస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పటాన్చెరు వైపు వెళ్లే మార్గంలో పోచారం చౌరస్తా దాటిన తర్వాత వాల్యుజోన్ వరకు లారీలు, ట్రావెల్స్ బస్సులు, డీసీఎంలు ఇష్టమొచ్చినట్లు నిలిపివేస్తున్నారు. సర్వీస్ రోడ్డుతో పాటు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వాహనాలతో నిండిపోతున్నాయి. ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ట్రాన్స్‌పోర్టు ఆఫీసులు ఉన్నాయి. దీంతో వాహనదారులు జాతీయ రహదారితో పాటు సర్వీస్ రోడ్డు పై వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో పాఠశాలకు చెందిన బస్సులు రావడంతో సర్వీస్ రోడ్డుపై వాహనాలు నిలిపి ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు ట్రాన్స్‌పోర్టు ఆఫీసు వారు ప్రతినెలా మామూళ్లు ఇస్తుండడంతో వారు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డుపై వాహనాలు నిలుపుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైవే పెట్రోలింగ్ వాహనాలు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. హైవేపై పెట్రోలింగ్ చేసే పోలీసులు వాహనాన్ని ఎక్కడో ఒకచోట నిలుపుకొని కాలం గడుపుతున్నారు. పైఅధికారులు ఫోన్చేస్తేనే రోడ్డుపైకి వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పటాన్చెరులో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసింది. పటాన్చెరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను పాశమైలారం పారిశ్రామిక వద్ద ఉన్న సిగ్నల్స్ సమీపంలో ఉంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇన్స్పెక్టర్ ను నియమించింది. ఎస్‌హెచ్‌వోగా ఇన్స్పెక్టర్ ఉండగా, 6 ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఎస్సైలను ప్రతిరోజు మార్పు చేస్తుండడంతో సమస్యపై అధికారులకు అవగాహన లేకుండా పోతున్నది. కొందరు ఎస్సైలు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కంటే ప్రతిరోజు వాహనాలకు ఫైన్స్ రాసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బైక్‌లు, కార్లు, మినీ గూడ్స్ వాహనాలు రాగానే రోడ్డు భద్రత నిబంధనల పేరుతో ఫైన్స్ వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ వాహనాలు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసినా చర్యలు తీసుకోవడం లేదు. ముత్తంగి ఎస్బీఐ బ్యాం కు ముందు ఉన్న సర్వీస్ రోడ్డుపై లారీలు, డీసీఎంలు నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఎస్పీ స్పందించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కఠినంగా వ్యవహరించాలని ప్రజలు,వాహనదారులు కోరుతున్నారు.