పటాన్చెరు, నవంబర్ 15: కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ రాజీనామా చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అశోక్‌నగర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో అనిల్‌కుమార్ రాజీనామా లేఖను విడుదల చేసి, రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గెకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల తీరుతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి దీనస్థితిలో ఉన్న సమయంలో ఆ పార్టీ జెండాను మోసినట్టు గుర్తు చేశారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఖర్చుకు వెనుకాడలేదన్నారు. ఇప్పుడు టికెట్ ఇచ్చే సమయంలో పార్టీ రాష్ట్ర నేతలు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. పార్టీ కోసం 24 గంటలు కష్టపడిన వారిని కాదని టికెట్ కావాలని అప్లికేషన్ కూడా పెట్టని వారికి టికెట్ కేటాయించడం అన్యాయమన్నారు. అప్లికేషన్ పెట్టని 40మందికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. బీసీలకు న్యాయంగా 34 సీట్లు ఇస్తామని మొండిచెయ్యి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి న్యాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదేండ్ల క్రితం పోటీలో నిలబడి 2.80లక్షల ఓట్లు సాధించానన్నారు. తనకంటే ముందు పోటీపడిన వారికి 1.60లక్షల ఓట్లే వచ్చాయన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడితే ఇప్పుడు పార్టీ రాష్ట్ర నేతలు తనకు అన్యాయం చేశారన్నారు. ఆఖరికి జాతీయ పత్రికలకు యాడ్లు ఇచ్చినందుకు ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు ఎదుర్కొనట్టు చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీలో ఏదో పదవి, పార్టీ టికెట్ ఇస్తారనే ఆశతోనే కదా అని పేర్కొన్నారు. కష్టపడేది టికెట్ కోసమైనప్పుడు ఆ టికెట్‌ను ఇవ్వకపోవడం తనను బాధించిందన్నారు. పార్టీ టికెట్లు ప్రకటించకముందున్న గ్రాఫ్ టికెట్లు కేటాయింపులు జరిగాక పడిపోయిందన్నారు. టికెట్ రాని విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర నాయకులెవరూ తనకు సరైన వివరణ ఇవ్వలేదన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు నా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా కలిచి వేశాయన్నారు. పార్టీ నాతో వ్యవహరించిన తీరుతో అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర నాయకులు తనతో మాట్లాడేందుకు కూడా ఆసక్తితో లేరన్నారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు తనవద్దకు వచ్చి వారి ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీలో సరైన గౌరవమర్యాదలు, ప్రాధాన్యతలు దక్కడం లేదన్నారు. తాను పార్టీ కోసం పనిచేసి అన్ని విధాలుగా నష్టపోయినట్టుగా తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు, వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్యానికి, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నానని గాలి అనిల్‌కుమార్ చెప్పారు. తనతోపాటు పెద్దసంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడుతున్నారన్నారు. మరింతమంది రాజీనామాలుంటాయని ఆసక్తి రేకెత్తించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. తన శ్రేయాభిలాషులు, పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. సమావేశం లో ఎంపీపీ నర్సాపూర్ జోయతి సురేశ్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్ కౌడిపల్లి ప్రెసిడెంట్ ఎల్లుగారి శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్ మైనార్టీ ప్రెసిడెంట్ అజ్మత్, టీబీవీఎస్ బీసీ స్టెట్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్, ఆవుల రమేశ్, బీసీ సంఘం నాయకులు నాయికోటి జీతయ్య, నర్సింగ్‌రావు, ఆకుల యాదయ్య, బత్తుల రాములు, నాయికోటి వెంకటేశ్, సందీప్, హఫీజ్, అన్వర్ ఖాన్, సమీయుద్దీన్, అఫ్రోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.