
గుమ్మడిదల, డిసెంబర్ 21 :దుండిగల్ ఓఆర్ఆర్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు 70 కిలోమీటర్ల పొడవు 765డీ జాతీయ రహదారిని కేంద్రప్రభుత్వం రూ. కోట్ల నిధులతో నాలుగులేన్ల రహదారిగా ఆధునీకరించింది. అయితే, ఇందుకైన ఖర్చును సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల శివారులో ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా ద్వారా చార్జీల రూపంలో వసూలు చేస్తున్నది. ఇప్పటికే పెరిగిన చమురు ధరలతో ఆర్థికంగా భారం మోస్తున్న తమపై టోల్గేట్ రూపంలో మరో గుదిబండ పడిందని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17 అధికారికంగా టోల్‌ప్లాజా ప్రారంభమవగా, ప్రస్తుతం కోరల్ ఏజెన్సీ దీన్ని నిర్వహిస్తున్నది. కాగా, తమకు సమాచారం ఇవ్వకుండా, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించకుండా, స్థానికులకు ఉచిత సౌకర్యం కల్పించకుండా టోల్ ప్లాజాను ప్రారంభించడమేంటని స్థానిక నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మండలంలోని 13 గ్రామాలకు చెందిన వాహనదారులు ఉచితంగా రాకపోకలు సాగించేలా మినహాయింపు ఇచ్చారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు ఉన్న 765డీ రహదారి జాతీయరహదారి అయిందన్న ఈ ప్రాంతవాసుల సంతోషం కొన్ని రోజుల్లోనే ఆవిరైంది. జాతీయరహదారి నిర్మాణానికి వెచ్చించిన నిధులను టోల్‌ప్లాజా రూపంలో వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు. కారుకు రూ. 60, ఆర్టీసీ బస్సులకు రూ. 2 వందలు, భారీ వాహనాలకు 320 నుంచి 480 వరకు చార్జీలు నిర్ణయించారు. దీంతో, వాహనదారులపై అదనపు భారం పడినైట్టెంది. గుమ్మడిదల మండలంలోని 13 గ్రామాల ప్రజలకు టోల్ రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రయాణికులను చేరవేసే ఆటోలకు నెలకు రూ. 4 వేలు చెల్లించాలని నిబంధన పెట్టగా స్థానిక నాయకులు నిర్వాహకులతో చర్చించి నెలకు రూ.వెయ్యి చెల్లించేలా ఒప్పించారు. కాగా, తమకు వచ్చే ఆదాయంలో టోల్ రూపంలో కొంత తగ్గిపోతుందని మిగతా ప్రైవేట్ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాహనదారులకు భారమే
ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులకు టోల్ ప్లాజాతో అదనపు భారంగా పడడం బాధాకరం. రోజంతా కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించే వారికి అందులో కొంత టోల్ రూపంలో పోవడంతో మరింత భారం పెరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రో, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంతో నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరిగాయి. తిరిగి టోల్గేట్ రూపంలో మరింత భారం పడడం ఆవేదన కలిగిస్తున్నది. చిన్న వాహనదారులకు మినహాయింపు ఇస్తే బాగుంటది.
మూడు నెలలు నిర్వహిస్తాం..
కోరల్ ఏజెన్సీ ద్వారా మూడు నెలలు టోల్ ప్లాజా నిర్వహిస్తాం. తరువాత నేషనల్ హైవే అథారిటీ టెండర్ పెట్టి కొత్తవారికి నిర్వహణ అప్పచెప్తారు. దీనిని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొత్త టెండర్ ద్వారా ఎన్ని ఏండ్లు టోల్‌ప్లాజాను నిర్వహిస్తారో మా వద్ద ఎటువంటి సమాచారం లేదు. వాహనదారులు సహకరించాలి.