నారాయణఖేడ్, మార్చి 25: దళితబంధు పథకం అణగారిన వర్గాల తలరాతలు మార్చనున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడనున్నది. పథకం మొదటి విడుతలో భాగంగా నారాయణఖేడ్ మండలం రుద్రారం, కల్హేర్ మండలంలోని మహదేవ్‌పల్లిలో వందమందిని అధికారులు ఎంపిక చేశారు. నేడు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
చిరు బతుకుల్లో చిరునవ్వులు..!
తరాలు మారుతున్నా తలరాతలు మారని బతుకులు.. దశాబ్దాలు గడిచినా అభివృద్ధి చెందని జీవితాలు.. ఎన్ని ప్రభుత్వాలొచ్చినా కంటి తుడుపు చర్యలు తప్ప దళిత కుటుంబాలను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు శూన్యం. తెలంగాణ ఏర్పడ్డాక అణగారిన వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించి అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన దళితబంధు పథకం మోడుబారిన జీవితాల్లో ఆశలను చిగురింపజేస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో వంద దళిత కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కల్పించి, వారికిచ్చిన మొత్తంపై వందశాతం సబ్సిడీ ఇస్తూ దళితులకు అండగా నిలుస్తున్నది ప్రభుత్వం. దళితబంధులో మొదటి విడుతలో భాగంగా ఎంపిక చేసిన నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామంలో 95 దళిత కుటుంబాలు, కల్హేర్ మండలంలోని మహదేవ్‌పల్లిలో 5 దళిత కుటుంబాలు దళితబంధు పథకం ఫలాలను అందుకోబోతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
వంద మంది.. రూ.10 కోట్లు
రుద్రారం గ్రామంలో మొత్తం 95 కుటుంబాలను ఎంపిక చేయగా, ఇందుకోసం గ్రామంలో అధికారులు పకడ్బందీగా సర్వే నిర్వహించి లబ్ధిదారుల ఆసక్తికనుగుణంగా యూనిట్లను కేటాయించారు. ఇందులో 29 మందికి డెయిరీ ఫారం, 26 మందికి సరుకు రవాణా వాహనాలు, 16 మంది సెంట్రింగ్ సామగ్రి, 6 మందికి ట్రాక్టర్లు, ముగ్గురికి జేసీబీ, మరో 15 మందికి రెడీమెడ్ గార్మెంట్స్, బ్యాంగిల్ స్టోర్, మినీ సూపర్ బజార్, ఆటో మొబైల్, మీసేవ, ల్యాబ్ టెక్నీషియన్ తదితర యూనిట్లను మంజూరుచేశారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలు ప్రారంభించి లావాదేవీలు కొనసాగించే వరకు దళితబంధు నిధుల నుంచే డబ్బులు వెచ్చించనున్నారు.
లబ్ధిదారులకు శిక్షణ.. వ్యాపారాలకు రక్షణ
లబ్ధిదారులు తమ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అ ణువుగా వారికి ప్రత్యేక శిక్షణనివ్వనున్నారు. వ్యాపారాల కు అవసరమైన పత్రాలు, లైసెన్సులు, అనుమతులను అధికారులే ఇప్పించనున్నా రు. అలాగే, ఆయా వ్యాపారాలకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను అధికారులు ఇప్పటికే గ్రామంలోనే ప్రత్యేక కేం ద్రం ఏర్పాటు చేసి అక్కడికక్కడే లబ్ధిదారులకు అందజేశారు. కాగా, వ్యాపారాలకు బీమా సదుపాయం ఈ పథకంలోని మరో గొప్ప అంశం. ప్రభుత్వం అందజేసే రూ.10 లక్షల నిధుల్లో రూ.10 వేలకు ప్రభుత్వం మరో రూ.10 వేలను కలిపి మొత్తం రూ.20 వేలను రక్షణ నిధికి కేటాయించి బీమా చేయడం ద్వారా వ్యాపారాలు ఏ కారణంతోనైనా ప్రమాదానికి గురై నష్టపోతే వ్యాపారాలు తిరిగి కొనసాగించేందుకు రక్షణ నిధి తోడ్పడుతుంది.
దళితబంధుతో దళితుల కష్టాలు దూరం..
ఏండ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో అనేక అవస్థలు పడిన దళితుల కష్టాలు దూరం కానున్నాయి. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఇతర వర్గాలతో సమానంగా దళితులు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో బృహత్తరమైన దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం గొప్ప విషయం. మా నియోజకవర్గంలో రుద్రారం, మహదేవ్‌పల్లి గ్రామాలను దళితబంధు కోసం ఎంపిక చేసి యూనిట్లను అందజేస్తున్నాం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– మహారెడ్డి భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే