మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 26: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లి ఓ నెత్తుటి సాక్ష్య ం.. అదో వీరోచిత పోరాటం.. సరిగ్గా 76ఏండ్ల క్రితం జలియన్ వాలాబాగ్ను మించిన నరమేధం.. మట్టి మనుషుల తిరుగుబాటు.. దోపిడీపై దండయాత్ర రజాకారు మూకలపై నిప్పు కణికలై రగిలిన నెత్తుటి మడుగు.. గడ్డికోసిన చేతులే కోడవళ్లుపట్టాయి..
బువ్వొండిన చేతులే బందూక్లను పట్టాయి.. రజాకారు దాష్టికాలకు, రాక్షసత్వానికి వ్యతిరేకంగా గర్జించి పిడికిలెత్తాయి. సామాన్యులే సాయుధులై రణ నినాదం చేశారు.. రైతన్నలే అగ్ని జ్వాలలై సమరశంఖం పూరించారు. మాతృభూ మి విముక్తి కోసం 118మంది వీరయోధులు చేసిన త్యాగాలకు నెత్తుటిసాక్ష్యమే ఈ ‘వీరబైరాన్పల్లి’ నేటి త రానికే కాదు భవిష్యత్ పోరాటలకు ఈ గ్రామం స్ఫూర్తి.
1948 ఆగస్టు 27న వేకువ జామున 4గంటల ప్రాంతంలో తుపాకీల మోత, తోపుల పేలుళ్లు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో గ్రామస్తులు ఉన్నారు. నిజాం సైన్యాధిపతి ఖాసీం రజ్వీ సైనికులు(రజాకార్లు) గతంలో గ్రామంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సుమారు 12 వందల మందితోపాటు భారీ మందు గుండు సామగ్రి, తుపాకులు, తోపులతో దొంగచాటున గ్రామంలోకి ప్రవేశించారు. ఉల్లెంగల వెంకటనర్సయ్య అనే గ్రామస్తుడిని రజాకార్లు పట్టుకోగా తప్పించుకొని రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారని కేకలు వేశాడు.
దీంతో గ్రామ దళ కమాండర్ ఇమ్మడి రాజిరెడ్డి అప్రమత్తమై, ప్రజలంతా తగిన రక్షణలో ఉండేందుకు నగారా మోగించాడు. నగారా శబ్దం విన్న బైరాన్పల్లి వీరులు నిద్ర లేచారు. బురుజుపై కాపలాగా వున్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్య నిద్రమత్తు వదిలించుకునేలోపే రజాకార్ల తుపాకి గుండ్లకు బలయ్యారు. గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు. ఇంటింటికీ తిరిగి 92మందిని నిలబెట్టి కాల్చి చంపి వారి రక్త దాహాన్ని తీర్చుకున్నారు. శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మ ఆడించారు. దాడిలో 25మంది రజాకార్లు చనిపోగా, 118మంది గ్రామస్తులు చనిపోయారని ప్రత్యక్ష సాక్షు లు చెబుతున్నారు. కూటిగల్ గ్రామంపై పడి 30 మందిని పొట్టన పెట్టుకున్నారు.