నారాయణఖేడ్, నవంబర్ 5: కర్ణాటకలోని బీదర్ జిల్లా హల్లిఖేడ్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దైవ దర్శనానికి మంగళవారం గ్రామం నుంచి బయలుదేరిన వారు తిరుగు ప్రయాణంలో విగతజీవులై తిరిగి వచ్చారు. ఈ సంఘటనతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ శోక సంద్రంలో మునిగింది.
వివరాలు.. జగన్నాథ్‌పూర్‌కు చెందిన రాచప్ప (55), కాశీనాథ్(60), నవనాథ్(27), ప్రతాప్(35)తో పాటు మనూరు మండలం ఎల్గోయికి చెందిన నాగరాజు (37) మంగళవారం రాత్రి కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా గానుగాపూర్ పుణ్యక్షేత్రానికి కారులో బయలుదేరి వెళ్లారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని గానుగాపూర్‌లో దర్శనం ముగించుకుని అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. బీదర్ జిల్లా హలిఖేడ్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కాశీనాథ్, నవనాథ్, నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా, కొన ఊపిరితో ఉన్న రాచప్పను దవాఖానకు తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు.
తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో ఉన్న ప్రతాప్‌ను బీదర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జగన్నాథ్‌పూర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. మృ తుల కుటుంబీకులతో పాటు బంధువులు, సన్నిహితుల రోదనలు మిన్నంటాయి. ముగ్గు రు మృతుల కడసారి చూపు కోసం వారి ఇండ్ల వద్ద బంధువులు, మిత్రులు విషణ్ణ వదనాలతో ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. బీదర్ సర్కార్ దవాఖానలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలకు బుధవారం గ్రామంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
