పెద్దశంకరంపేట,మే23: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలానికి చెందిన ఇన్చార్జి ఎంపీడీవో విఠల్‌రెడ్డి డ్రైనేజీ పనుల విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా మెదక్ జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేట మేజర్ గ్రామపంచాయతీకి చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన డ్రైనేజీ పనులకు సంబంధించి మొత్తం రూ.2.92 లక్షల పనులు ఉండగా అందులో రూ.1,95 లక్షల పనులు పూర్తి కావడంతో అప్పుడు ఎంపీవోగా విధులు నిర్వహించిన విఠల్‌రెడ్డి ఎంబీ చెక్కు ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్ చేశారన్నారు.
ప్రస్తుతం అతను పెద్దశంకరంపేట ఇన్చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఎంబీకి సంబంధించి లంచం అడగడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఈనెల 20వ తేదీన ఫిర్యాదు చేశారన్నారు. శుక్రవారం సాయంత్రం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో రూ.15 వేల నగదు ఇన్చార్జి ఎంపీడీవో విఠల్‌రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. రూ.15వేల నగదు స్వాధీనం చేసుకొని అవినీతికి పాల్పడిన అధికారిని నాంపల్లి కోర్టులో ప్రవేశపర్చనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు.