చౌటకూర్, ఏప్రిల్ 28: ఓ రైతుకు జామీను ఇచ్చిన పాపానికి మరో రైతు అకౌంట్లో జమ అయిన రైతు భరోసా, ఆసరా పింఛన్ డబ్బులను బాకీ కింద జమ చేసిన బ్యాంకు మేనేజర్ ఉదంతమిది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజనతండాకు చెందిన హట్యా రాములు ఐదేండ్ల క్రితం చౌటకూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీతో సదరు రైతు రుణం డబ్బులు బ్యాంకులో చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హట్యా రాములుకు నయా పైసా పంటరుణ మాఫీకాలేదు.
హట్యా రాములు రుణం పొందిన సమయంలో చౌటకూర్‌కు చెందిన బేగరి రాములు ష్యూరిటీగా ఉన్నాడు. రాములుకు నాలుగైదు రోజుల క్రితం ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రూ.ఆరు, మరో రూ.రెండు వేలు ఆసరా పింఛన్ డబ్బులు బ్యాంకు అకౌంట్లో జమయ్యాయి. రైతు భరోసా, ఆసరా పింఛన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు మంగళవారం బేగరి రాములు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. నీవు హట్యా రాములుకు ష్యూరిటీగా ఉన్నావు.. ఆయన రుణం పొందిన డబ్బులు చెల్లించడం లేదని..అందుకే నీఅకౌంట్లోని డబ్బులను హట్యా రాములు అప్పు కింద జమ చేస్తున్నామంటూ బ్యాంకు మేనేజర్ మాధవరెడ్డి తేల్చి చెప్పారు. దీంతో బేగరి రాములు హట్యా రాములుకు సమాచారం అందించాడు.
దీంతో బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్ జైపాల్‌నాయక్, మరికొంత మంది రైతులతో కలిసి బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ష్యూరిటీగా ఉన్నందుకు రాములు అకౌంట్లోని రైతు భరోసా, ఆసరా పింఛన్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని బ్యాంకు మేనేజర్ మాధవరెడ్డిని నిలదీశారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయం డబ్బులను ఏవిధంగా అప్పుకింద జమ చేస్తారంటూ ప్రశ్నించారు. ష్యూరిటీగా ఉన్న బేగరి రాములు రైతు భరోసా, ఆసరా పింఛన్ డబ్బులను వెంటనే చెల్లించాలంటూ బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్ జైపాల్‌నాయక్ పట్టుబట్టారు. ప్రభుత్వం పంట రుణమాఫీ చేస్తుందన్న ఉద్దేశంతో రైతు హట్యా రాములు డబ్బులు చెల్లించలేదన్నారు. ఈ విషయమై అననపు కలెక్టర్ పాండుతో ఫోన్లో మాట్లాడగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి సమస్య పరిషారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు రైతుల అకౌంట్లను తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మాధవరెడ్డి ఫ్రీజ్ చేశారు. బైరు గంగయ్య, ఆయన భార్య సాయమ్మ, కుమారుడు శేఖర్‌కు చౌటకూర్ గ్రామీణ బ్యాంకులో సేవింగ్ ఖాతాలు ఉన్నాయి. గంగయ్య బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం పంటరుణమాఫీ చేస్తుందన్న ఉద్దేశంతో డబ్బులు చెల్లించలేదు. దీంతో ముగ్గురు అకౌంట్లను స్తంభింపంజేశారు. వీరికి వరి ధాన్యం డబ్బులు అకౌంట్లో జమ కావడంతో ఆ డబ్బులు తీసుకోకుండా ఫ్రీజ్ చేశారు. కాగా గంగయ్య తండ్రి మల్లయ్య అనారోగ్యానికి గురై 2022లో మృతి చెందారు. ఆ ఆకౌంట్లో రూ.20 వేలు సేవింగ్ ఖాతాలో ఉన్నాయి. తమ తండ్రి అకౌంట్లో ఉన్న డబ్బులు చెల్లించాలంటూ ఏడాదిన్నర కాలంగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. రూ.20 వేలు గంగయ్య అకౌంట్లో జమ చేశామని చెప్పడంతో మంగళవారం బ్యాం కుకు వచ్చాడు. మల్లయ్య మరణ ధ్రువపత్రం అందజేయలేదని, అందుకే డబ్బులు గంగయ్య అకౌంట్లో జమ చేయలేదని మేనేజర్ మాధవరెడ్డి తెలిపారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సేవింగ్ ఖాతాలను స్తంభింపజేయడంతో బ్యాంకు అధికారుల పని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.