వెల్దుర్తి, మే 14 : తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మర్కంటి మంజుల తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లగా గమనించిన దొంగలు తాళం పగులగొట్టి బీరువాలోని వస్తువులను, బట్టలను చిందర వందరగా పడేసి రూ.30 వేల నగదుతో పాటు వెండి అభరణాలను ఎత్తుకెళ్లారు.
విషయాన్ని వెల్దుర్తి పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుండి వివరాల సేకరించి, పంచనామా చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన ఖాజాపూర్ దుర్గయ్య ఇంట్లో చోరీకి యత్నించిన దొంగలు ఇంటి తలుపులు పగులగొట్టడానికి యత్నించగా, ఇంట్లో వాళ్లు లేచి అరవడంతో దొంగలు పారిపోయారు.