మెదక్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేక కింది స్థాయి నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది. తాజాగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, డీసీసీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ మధ్య సయోధ్య లేకపోవడంతో నియోజకవర్గంలో ఎవరి కార్యక్రమాలు వారే చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా మెదక్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరువర్గాలు గొడవలకు దిగాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఇరువర్గాలను నచ్చజెప్పడంతో కార్యకర్తలు సద్దుమణిగారు. అంతేకాకుండా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మ్యాడం బాలకృష్ణ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌కు అయోమయ పరిస్థితే ఉంది. కేడర్ అంతా ఒక వైపు ఉంటే నేతలు మాత్రం నలువైపులా వెళ్తున్నారు. దీంతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
నియోజకవర్గానికి నలుగురు లీడర్లు
మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పటిష్టమైన నేత లేరన్న వాదనలు ఉన్నాయి. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేనంటే నేను అంటూ రంగంలో నలుగురు దిగారు. ఎవరికి వారుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మెదక్‌లో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ, పీసీసీ సభ్యుడు చౌదరి సుప్రభాత్రావు, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు.
ఇందులో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మ్యాడం బాలకృష్ణల మధ్య గ్రూపులు ఉన్నాయి. ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని కారణంగా మ్యాడం బాలకృష్ణ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. నర్సాపూర్‌లో మాజీ పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, గాలి అనిల్‌కుమార్, ఆవుల రాజిరెడ్డి, సోమన్నగారి రవీందర్‌రెడ్డి ఉండగా, ఇటీవల నేతల మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది. ఒక నేత ఏర్పాటు చేసే ఫ్లెక్సీలో మరో నేత ఫొటో పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికి వారుగా గ్రూప్‌లుగా మారడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో గందరగోళంగా మారింది.
కాంగ్రెస్‌లో ప్రజాబలం ఉన్న నేత లేరు!
మెదక్ జిల్లా కాగ్రెస్‌లో ప్రజా బలం ఉన్న నేతలు లేరు. జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి, మ్యాడం బాలకృష్ణతోపాటు మరికొంత మంది నాయకులు ఉన్నా అందులో ప్రజాబలం ఉన్న నేతలు లేరన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. గతంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌లో ఉత్సాహంగా పనిచేస్తున్న సందర్భంలో మ్యాడం బాలకృష్ణ అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి మైనంపల్లి హన్మంతరావు, తనయుడు రోహిత్ కాంగ్రెస్‌లో చేరడంతో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేశారు.
అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు
మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పటికే గందరగోళం ఉంది. నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి నమ్మకంతో పనిచేసిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. దీంతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌లో మైనంపల్లి ఎంట్రీతో మెదక్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.