సిద్దిపేట, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డమ్మీ బిల్లులు పెట్టి పెద్ద ఎత్తు న డబ్బులు డ్రా చేసినట్లు పలు సొసైటీలపై ఆరోపణలు వస్తున్నాయి.డబ్బులకు ఆశపడి వోచర్లు చూపకుండానే అధికారులు ఆడిట్ చేస్తున్నారు.లక్షల రూపాయల అవినీతి జరిగినా ఆడిట్ అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. ధాన్యం కొనుగోలు సమయంలో గన్నీ బ్యాగుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. రైతుల పంట రుణమాఫీ కావడంతో సహకార సంఘాల అస లు గుట్టు రట్టవుతున్నది. రైతుల పంట రుణాల్లో గోల్మాల్ జరిగాయి.
సొసైటీ అధికారుల తీరు వల్ల ఎంతో మంది రైతులు పంటరుణమాఫీ కాకుండా నష్టపోతున్నారు. ఇదంతా జిల్లా స్థాయి అధికారుల అండతోనే సొసైటీ సెక్రటరీలు చేస్తున్నారు. ఇందులో అం దరూ వాటాలు పంచుకుంటున్నారు. ఇటీవల కొన్ని సొసైటీలపై వచ్చిన ఆరోపణలను బట్టి ఇదిస్పష్టంగా తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన సొసైటీపై విచారణకు జిల్లాస్థాయి డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి ఏదో విచారణ చేశామా..? అంటే చేశాము అని నివేదికలు ఇస్తున్నారు తప్పా అసలు గుట్టు రట్టు చేయడం లేదు. దీని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు వారికి ముడుతున్నాయి. దీంతో వారికి అనుకూలంగా అంతా సక్రమమే అని పాజిటీవ్ రిపోర్టు ఇస్తున్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆ సొసైటీ పరిధిలోని రైతులు ఆరోపిస్తున్నారు.ఈ సొసైటీలో 2020 నుంచి 2023 వరకు జరిగిన అక్రమాలపై ఇటీవల జిల్లా కలెక్టర్‌తో పాటు సీఎం క్యాంపు కార్యాలయం, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్సీఎస్ హైదరాబాద్ వారికి రైతులు ఫిర్యా దు చేశారు. సొసైటీ సెక్రటరీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారీగా అవినీతికి పాల్పడ్డాడని సొసైటీ పరిధిలోని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2020, 2021, 2022, 2023లో ఆడిట్ చేసేటప్పుడు వోచర్లు లేకుండానే అధికారులు ఆడిట్ చేశారు. దీని వెనుక ఆడిట్ అధికారులకు డబ్బులు ఇచ్చి అంతా ఒకే చేయించుకున్నాడు.
ఈ సొసైటీ పరిధిలో మొత్తం 23 గ్రామా లు ఉండగా 3675 మంది రైతులు ఉన్నారు. 848 మంది రైతులు పంటరుణాలు తీసుకున్నారు. వీరిలో 311 మందికి లక్షా 50 వేల వరకు, 44 మందికి 2 లక్షల వరకు పంటరుణమాఫీ అయింది. మొత్తం 355 మందికి ఈ సొసైటీ పరిధిలో పంటరుణమాఫీ కాగా ఇంకా 493 మందికి పంటరుణమాఫీ కావాల్సి ఉన్నది. ఐతే చాలావరకు రైతులకు పంటరుణాలు ఇచ్చేటప్పు డు చెక్ లీస్టులో ఒక హెక్టార్‌కు ఎంత రుణం మంజూరు చేశాం..ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అనే వివరాలు ఉం టాయి. రైతులకు ఇచ్చేటప్పుడు ఇవి ఏవీ చూపించకుండానే ఇంతరుణం ఇస్తున్నాము అని చెబుతారు. ఖాళీ వోచర్ మీద సంతకం తీసుకుంటారు. తర్వాత డబ్బు లు రాస్తారు.
ఇలా చాలామంది రైతులు నష్టపోతున్నారు. ఈ సొసైటీ కింద ఫర్టిలైజర్, పెట్రోల్ బంక్‌లు కూడా ఉన్నాయి. వీటిలో కూడా నిధుల గోల్మాల్ జరిగింది. ప్రభుత్వ అనుమతితో ప్రతిఏటా సొసైటీ పరిధిలో పది కొనుగోలు కేంద్రాలు నడుపుతారు. దీంట్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. సహకార చట్టం ప్రకారం పాలకవర్గం వారికి ఎవరికీ కూడా కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత ఇవ్వవద్దు కానీ, ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ బాధ్యతలు కేటాయించారు. నాలుగేండ్లుగా గన్నీబ్యాగులను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. సొసైటీలో అంతా నా ఇష్టం నేను చెప్పిందే వేదం.. అన్న తరహాలో సెక్రటరీ వ్యవహరిస్తున్నారు. పాలకవర్గానికి తెలుపకుండానే సంతకాలు తీసుకొని ఇష్టానుసారంగా రాసుకొని జిల్లా అధికారుల అనుమతి తీసుకున్నట్లు సమాచారం.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ సొసైటీలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. పెద్ద మొత్తంలోనే స్కాం జరిగింది. సొసైటీ సెక్రటరీ ఇష్టానుసారంగా వ్యవహరించి సొసైటీకి భారీగానే కన్నం వేశాడనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా స్థాయి అధికారులను మచ్చిక చేసుకొని తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. 2020 నుంచి 2023 వరకు విచారణకు వచ్చిన ఒక అధికారి, సొసైటీ సెక్రటరీ ఇచ్చిన మామూళ్లతో ఎలాంటి విచారణ చేయకుండానే రిపోర్టు ఇచ్చాడు. రెండోసారి ఇంకో అధికారిని నియమించారు. జిల్లా స్థాయి అధికారుల హస్తం కూడా దీంట్లో ఉన్నది.
పాలకవర్గ సమావేశాలు జరిగినప్పడు విందులు, వినోదాల పేరిట భారీగా ఖర్చు చేశారు. టూర్ల పేరిట ఇతర ప్రాంతాలకు తీసుకుపోయారు. తనకు ఎదురుగా ఎవ రు మాట్లాడిన వారిని డబ్బులు ఇచ్చి అనుకూలంగా మార్చుకున్నారు. సొసైటీ నిధులను డమ్మీ రసీదులతో డ్రా చేసి అవినీతికి పాల్పడ్డా డు. తన అవినీతి సొమ్ముతో బినామీ పేర్లతో లారీలు సైతం తీసుకున్నాడు. సొసైటీలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆ డబ్బులు రికవరీ చేయాలని సొసైటీ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతున్నది. ఇప్పటి వరకు ఒక విచారణ పూర్తి చేశాం. దాం ట్లో కొంత క్లారిటీ వచ్చింది. కొంత అక్రమాలు జరిగిన మాట వాస్తవమే ..రెండో విచారణ చేపడుతున్నాం. గన్నీ బ్యాగులకు సంబంధించిన వాటితోపాటు ఇతర అంశాలపై విచారణ పూర్తయ్యాక ఎంత జరిగింది… ఏం జరిగింది అన్న విషయాలు తెలియజేస్తాం. ఇప్పు డే ఏం చెప్పలేం.
– కరుణ, డీసీవో, మెదక్ జిల్లా