Manjeera Pushkaralu | గంగా పుష్కరం అనగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకొనే గంగానది పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది. బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తవుతుంది. పుష్కర కాలం సాధారణంగా ఏడాది పాటు ఉంటుంది. పుష్కర కాలంలో మొదటి పన్నెండు రోజులను ఆది పుషరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుషరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకల దేవతలతో కలిసి వచ్చి ఉంటాడని, ఈ పన్నెండు రోజుల్లో గంగా నదిలో స్నానం చేయడంతో సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం దకుతుందని పురాణాలు చెబుతున్నాయి.
మెదక్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూర్ గ్రామ శివారులో గరుడగంగా మంజీరా నదికి 2011లో తొలిసారి పుష్కరాలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించారు. ఆ తర్వాత 12 ఏండ్ల తర్వాత మళ్లీ 2023 ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 3 వరకు పుష్కరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంజీర నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలిగి పుణ్యం లభిస్తుందని వేదపండితులు చెబుతున్నారు. ఈ స్థలంలో ఎకడ మూడు అడుగుల లోతు గుంత తవ్వినా తెల్లటి విభూతి లభిస్తుంది. అప్పట్లో సర్పగాయం జరుగగా, ఆ సర్పాల దహనమే ఈ విభూతి అని స్థలపురాణం చెబుతున్నది.
మెదక్ జిల్లా పేరూరు గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ప్రస్తుతం సరస్వతీ ఆలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు భీకర కీకారణ్యం. ఆ అడవికి పరిక్షిత్ అనే మహారాజు వేటకు వెళ్లాడట. దాహం తీర్చుకునేందుకు ఓ కొలను వద్దకు వెళ్లి నీరు తాగాడు. ఆ కొలను పకనే శృంగి (రుషి) మహాముని తపస్సులో ఉన్నాడు. ఆ రుషిని గమనించిన పరిక్షత్ మహారాజు నన్ను చూసి పలకరించడం లేదు అనే గర్వంతో అకడే చనిపోయి ఉన్న ఓ పామును తీసి తపస్సులో ఉన్న శృంగిమెడలో వేసి వెళ్లిపోయాడు. కాసేపటికి ఆ ముని కుమారుడు శనీక మహాముని వచ్చి మా తండ్రి మెడలో ఈ చనిపోయిన పామును ఎవరు వేశారో అతడు పాముకాటుతో చనిపోవుగాక అని శాపం పెడతాడట. ఆ విధంగా పరిక్షిత్ మహారాజు పాముకాటుతో చనిపోతాడు. పరీక్షితుడి కుమారుడు జనమేజయుడు ఆగ్రహించి తన తండ్రి చావుకు కారణమైన పాములను చంపేస్తానని ఈ ప్రాంతంలో సర్పయాగం చేస్తాడు. ఆ యాగంలో పాములు పడి చనిపోతుంటాయి. అప్పుడు పాములు రక్షించాలని బ్రహ్మదేవుడిని వేడుకోగా, ప్రత్యక్షమై గరుడ పక్షిని పిలిచి పాతాళంలోని నీటిని(గంగ)ను తెచ్చి యాగాన్ని చల్లార్చాలని చెప్పడంతో అది చల్లార్చిందని ప్రతీక. ప్రస్తుతం మంజీర అని పిలిచే ఈ నది ఒకప్పుడు గరుడ గంగా పిలిచేవారు. ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఎకడా మూడు అడుగుల గుంత తవ్వినా తెల్లటి విభూతి బయట పడుతుంది. ఆ నాటి సర్పాల అవశేషాలే ఈ విభూతి అని చెబుతుంటారు.
పూర్వ తుందిలుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన తన తపస్సుతో పరమేశ్వరుణ్ణి సాక్షాతరింప చేసుకోగా, ఆ పరమాత్మ వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందిల మహర్షి నీలో నన్ను లీనం చేసుకో అని వరం కోరుకోగా, ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలంలో తుందిలుడిని లీనం చేసుకున్నాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన తుందిల మహర్షి మూడున్నర కోట్ల తీర్థాలకూ ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు. సృష్టి మనుగడకు నీరే ఆధారం. జల సంపత్తి అంతా తుందిల మహర్షి ఆధీనంలో ఉండిపోవడంతో ఆ సృష్టికర్త బ్రహ్మ శివుడిని ప్రార్ధించి, పుష్కరుడిని తన కమండలంలోకి ఆవాహన చేసుకున్నాడు. బృహస్పతి (గురుగ్రహం) లోకాన్ని కాపాడడం కోసం తనకు పుష్కర స్పర్శ కావాలనుకున్నాడు. అందుకోసం జలాన్ని ఇవ్వాల్సిందిగా బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ, పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలి వెళ్లనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. మేషాది రాశుల్లో బృహస్పతి ప్రవేశించినప్పుడు మొదటి, చివరి పన్నెండు రోజులూ పూర్తిగా, మిగిలిన సంవత్సరమంతా మధ్యాహ్న కాలంలో రెండు ముహూర్తాల కాలం పాటు పుష్కరుడు ఆ నదీ జలాల్లో ఉండేలాగా ఒప్పదం జరిగింది. పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు ముకోటి దేవతలు, పితృదేవతలు ఆ నదీజలంలో ఆవాహనమై ఉంటారు. అందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది. శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.
పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉందో, దానాలకు అంతే ప్రాముఖ్యత ఉంది. పుష్కర 12 రోజుల్లో ఒకోరోజు ఒకో దానానికి ప్రసిద్ధి. దానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మొదటి రోజు: భూదానం, ధాన్య దానం, సువర్ణ దానం, రజత దానం, అన్న దానం.
రెండో రోజు: రత్నదానం, గోదానం, లవణ దానం, వస్త్ర దానం
మూడో రోజు: గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం (పండ్లు)
నాలుగో రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె
ఐదో రోజు: ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు
ఆరో రోజు: ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం
ఏడో రోజు: గృహదానం, మంచం, కుర్చి, పీట లాంటి గృహోపకరణ వస్తువులు
ఎనిమిదో రోజు : చందనం, కంద మూలాలు, పుష్ప మాలలు
తొమ్మిదో రోజు: కంబళ్లు, దుప్పట్లు, పిండ దానం, దాసీ దానం
పదో రోజు: కూరగాయల దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం
పదకొండో రోజు: గజ దానం
పన్నెండవ రోజు: నువ్వుల దానం
మెదక్ జిల్లా పేరూరు సమీపంలో గరుడ గంగా తీరాన 12 రోజుల పాటు జరిగే మంజీరా నది పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 12 ఏండ్ల తర్వాత ఈనెల 22 నుంచి మళ్లీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.12 రోజులపాటు జరిగే పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. 12 రోజుల పాటు పుష్కరాలు పూర్తయ్యేవరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
-దోర్భల రాజమౌళి శర్మ, సరస్వతీ దేవాలయ వ్యవస్థాపకులు, చండీ ఉపవాసకులు, పేరూరు (మెదక్ జిల్లా)