చేర్యాల, డిసెంబర్ 13 : భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవానికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చాకుడు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణ ఆహ్వాన పత్రికలను దాతలు, భక్తులకు పంపిణీ చేశారు.
ఉత్సవానికి ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు, వధువులు మేడలాదేవి, కేతమ్మదేవీ తరపున మహాదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపిస్తారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణములోని తోట బావివద్ద గల కల్యాణ వేదికలో బర్థిపూర్ పీఠాధిపతి డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహాస్వామీజీ మల్లన్న ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహిస్తారు.
రెండు రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అలయ వర్గాలు ఏర్పాటు చేశాయి. 30 వేల వరకు భక్తులు వస్తారని భావిస్తున్నారు. బారికేడ్లు, షామియానాలు, పచ్చదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. 24గంటల పాటు కరెంట్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. 60వేల లడ్డూ ప్రసాదాలతో పాటు 5 క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేశారు. జేబీఎస్, సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో మెదక్ ఏసీ సుధాకర్‌రెడ్డితో పాటు వివిధ దేవాలయాలకు చెందిన అధికారులు, సిబ్బందిని కల్యాణోత్స నిర్వహణకు దేవాదాయశాఖ నియమించింది. సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, మండల స్ధాయి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.