మెదక్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 40 ఏండ్లలోపు వారు 5,02,897 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లులో 9,21,400 మహిళా ఓటర్లు ఉండడం, ఆమె తీర్పుతో పాటు 40 ఏండ్లలోపు వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి. అయితే ఏ వయస్సువారు ఏ పార్టీకి ఓటు వేస్తారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది.. ఏ పార్టీకి లాభం ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పరిధి ఓటరు జాబితా ప్రకారం సగంమంది 40 ఏండ్లలోపువారే. 19 ఏండ్ల వయస్సు ఓటర్లు 53,458 మంది, 30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు 3,96,228 మంది, 40 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు 5,02,897 మంది. నాలుగు పదుల వయస్సు దాటనివారు మొత్తం 9.53 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో సగం మంది ఓటర్లు ఈ వయస్సువారే కావడం గమనార్హం. అదేవిధంగా ఓటు వేసేవారు కూడా ఈ వయస్సు వారే ఎక్కువగా ఉంటారు. అభ్యర్థి గెలుపోటములపై వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, పటాన్చెరు, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న యువ, యువజన ఓటర్లు తమకే ఓటు వేస్తారని ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంచనాలు వేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. అదేఊపుతో ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్కే ఓటు వేస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు అధిక సీట్లు రాకపోవడంతో అధికారం చేజారిపోయింది. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈసారి బీఆర్ఎస్కే ఓటు వేస్తారనే నమ్మకం ఉందని గులాబీ నాయకులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలపై యువత, మధ్య వయస్సు ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు చేసిన తప్పులను సరిచేసుకొనే ప్రయత్నంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో ఉన్నామని తమకే ఓటర్లు పట్టం కడతారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.