వర్గల్, ఏప్రిల్ 8: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్పల్లి వద్ద గల బంధం చెరువు మత్తడి నీటి ఉధృతికి కొట్టుకుపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాలువకు అధికారులు నీటిని విడుదల చేయగా, నీటి ప్రవాహం ఉధృతికి చెరువు మత్తడి కొట్టుకుపోయింది. గ్రామ రైతులు అధికారుల దృష్టికి తెచ్చినా మత్తడి నిర్మాణ పనులు చేపట్టడం లేదు. బంధం చెరువు కట్ట మరమ్మతులు, మత్తడి నిర్మాణానికి మూడేండ్ల క్రితమే బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరైన పనులకు మోక్షం లభించడం కొండపోచమ్మసాగర్ నుంచి వర్గల్ మండలంలో గోదావరి జలాలు మొదటగా చౌదర్పల్లి బంధం చెరువు నుంచి వర్గల్ పెద్ద చెరువుకు చేరుతాయి.
ఆ తర్వాత శాకారం ధర్మాయి చెరువు, అంబర్‌పేట ఖాన్ చెరువు, అక్కడి నుంచి నాచారం హల్దీవాగు మీదుగా మెదక్ జిల్లాలోని తూప్రాన్, వెల్దుర్తి మండల్లాలోని హల్దీ వాగు గుండా ప్రవహిస్తూ మంజీరా నదిలోకి వెళ్తాయి. నెల క్రితం నీటి ఉధృతికి మత్తడి కొట్టుకుపోయి చెరువులో 70శాతం నీటి నిల్వలు లేకుండా పోయాయి. దీంతో బంధం చెరువు పరీవాహక ప్రాంత రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులకు రూ.70 లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటితో చెరువుకట్ట మరమ్మతులు, మత్తడి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. చెరువు కట్ట సామర్థ్యం, మత్తడి పటిష్టం గుర్తించి నీటిని వదలాల్సిన అధికారులు, ఎక్కువ మొత్తంలో నీటిని వదలడంతో నీటి ప్రవాహానికి మత్తడి కొట్టుకుపోయింది. చెరువుకట్ట సైతం ప్రమాదస్థితికి చేరింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బంధం చెరువును పటిష్టం చేసి మేలుచేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి..
బీఆర్ఎప్ ప్రభుత్వ ఉన్నప్పుడు బంధం చెరువు అభివృద్ధి, మరమ్మతులకు అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిధులు మంజూరు చేయించారు. అంతలోనే సాధారణ ఎన్నికలు వచ్చి పనులకు బ్రేక్‌పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏండ్లు దాటినా పనులు చేపట్టకపోవడంతో మత్తడి కొట్టుకుపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం పనులు చేయించి, రైతులకు మేలు చేయాలి.
– కృష్ణారెడ్డి, రైతు సంఘం నాయకుడు వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా